Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉర్దూ విశ్వవిద్యాలయ పురోగతి అభినందనీయం : గవర్నర్ హరించందన్

Advertiesment
ఉర్దూ విశ్వవిద్యాలయ పురోగతి అభినందనీయం : గవర్నర్ హరించందన్
, శుక్రవారం, 19 మార్చి 2021 (14:05 IST)
ద్విభాషా విధానంలో ఉర్దూ విశ్వవిద్యాలయం విద్యార్థులకు బోధనను అందించటం ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఉర్దూ భాషా సంస్కృతిని పరిరక్షించాలన్న ధ్యేయంతో ప్రత్యేక విశ్వవిద్యాలయానికి పునాది వేశారన్నారు. విస్తృతమైన పరిశోధన, ఉర్దూ భాష నిర్మాణం, మూలాలు, చరిత్రపై ఆసక్తిని కలిగించడమే ముఖ్య ఉద్దేశ్యంగా విశ్వ విద్యాలయం పని చేయటం ముదావహమన్నారు. 
 
కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఒకటి, రెండు, మూడు స్నాతకోత్సవాలు శుక్రవారం విశ్వవిద్యాలయ ఆవరణలో నిర్వహించారు. విశ్వవిద్యాలయ ఛాన్సలర్ హోదాలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ నుండి ఆన్ లైన్ విధానంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
కర్నూలు నుండి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం మాజీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ మొహమ్మద్ అస్లాం పర్వైజ్,  వైస్ ఛాన్సలర్ అచార్య ముజాఫర్ అలీ, రిజిస్ట్రార్ అచార్య శ్రీనివాసులు పాల్గొనగా, విజయవాడ నుండి గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ మన జ్ఞానాన్ని ఇతర భాషలలో అనువాదం చేయటం ద్వారా దాని వ్యాప్తికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని నూతనంగా ఏర్పడిన విశ్వవిద్యాలయాల ఉన్నతిని తాను నిశితంగా గమనిస్తున్నానని,  అవి పురోగమన దిశలో పయనించటం ముదావహమన్నారు. ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభమై ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో బోధనను అమలు చేస్తూ విశ్వవిద్యాలయం ముందుగు సాగటం ప్రశంశనీయమన్నారు. సమర్థవంతమైన ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి చెందుతున్న ఉన్నత విద్యా సంస్థలతో రాయలసీమ ప్రాంతం విద్యా రంగంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోందన్నారు. 
 
76 మందితో ప్రారంభమైన విశ్వవిద్యాలయం ప్రస్తుతం 400 మంది విద్యార్ధులను కలిగి ఉండటం పురోగతికి నిదర్శనమన్నారు.  భాష, సంస్కృతులను పరిరక్షించాలనే లక్ష్యంతో స్థాపించబడిన సంస్థలకు ప్రతీకగా ఉర్దూ విశ్వవిద్యాలయం ముందడుగు వేస్తుందని, ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని పరిరక్షించడంతో పాటు పరిశోధనలకు తగిన ప్రాధన్యత ఇస్తుండటం అభినందనీయమని గవర్నర్ అన్నారు.
 
విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న వారు తమ దేశం, తల్లిదండ్రులు, జన్మభూమి వంటి విషయాలను మరువరాదని, శాంతి, సోదరభావం, ప్రేమతో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఆశించిన లక్ష్యాలను సాధించిన తర్వాత, సమాజానికి సేవ రూపంలో ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసారు. ఈ సందర్భంగా డిగ్రీలు పొందిన గ్రాడ్యుయేట్లను గవర్నర్ అభినందించారు. 
 
డిగ్రీలు పొందిన వారిలో 70శాతం మంది బాలికలే ఉండటం ఆనందదాయకమన్నారు.  దేశం యొక్క గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వాన్ని పరిక్షించవలసిన బాధ్యత యువతపై ఉందన్న గవర్నర్,  ఎంచుకున్న రంగంలో మార్గదర్శకుల అడుగుజాడల్లో పయనించాలని, రంగం ఏదైనప్పటికీ నిజాయితీతో, అంకితభావంతో ముందడుగు వేయాలన్నారు. ప్రతిభ కనబరిచిన 11 విద్యార్ధులకు ఉపకులపతి బంగారు పతకాలు బహుకరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శేషాచలం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు