రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్లు వేయించేందుకు డబ్బులు లేవని చెప్పడం సిగ్గుచేటని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కానీ, జగనన్న పథకాల అమలుకు మాత్రం డబ్బులు ఉన్నాయా అని ప్రశ్నించారు.
కరోనా వైరస్ కారణంగా ఏపీలో జరుగుతున్న మరణ మృదంగంపై ఆయన మాట్లాడుతూ, కరోనా వల్ల ఎంత మంది చనిపోయారో శ్మశానాల్లో లెక్కలు తీస్తే జగన్ సర్కారు తల ఎత్తుకోలేదన్నారు. అర్థం లేని కక్ష సాధింపు వ్యవహారాల్లో మునిగి తేలుతున్న ముఖ్యమంత్రి తన అసమర్థతకు ఎంత మందిని బలి తీసుకొంటారోనని ఆవేదన వ్యక్తం చేశారు.
పత్రికలు, టీవీల్లో తన ప్రచారానికి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం కరోనా వ్యాక్సిన్ కొనడానికి డబ్బులు లేవని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. కరోనా పరీక్షల కిట్లు చాలినన్ని లేవు. ఆస్పత్రుల్లో పడకలు లేవు. వ్యాక్సిన్లు లేవు. మొదటి డోస్ వేయించుకొన్న వారికి రెండో డోస్ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు శ్మశానాల్లో స్థలం సరిపోవడం లేదు కాబట్టి, జగనన్న శ్మశానాలను కూడా ఏర్పాటు చేసే ఆలోచన చేయాలి అన్నారు.