Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపం వెలుగులో చదువుకున్నాడు.. సివిల్స్ 3వ ర్యాంక్ కొట్టాడు.. కోచింగ్ సెంటర్లను ఛీత్కరించాడు

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగుల పాటులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఒక అత్యంత సామాన్య వ్యక్తి ఆలిండియా స్థాయిలో సివిల్స్ ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించి కోచింగ్ సెంటర్లకు గుణపాఠం నేర్పారు. ఒకటవ తరగతి నుంచి సివిల్స్ వరకు తెలుగు మీడియంలోనే చదివి, రాసి త

Advertiesment
gopalakrishna
హైదరాబాద్ , గురువారం, 1 జూన్ 2017 (06:15 IST)
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగుల పాటులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఒక అత్యంత సామాన్య వ్యక్తి ఆలిండియా స్థాయిలో సివిల్స్ ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించి కోచింగ్ సెంటర్లకు గుణపాఠం నేర్పారు. ఒకటవ తరగతి నుంచి  సివిల్స్ వరకు తెలుగు మీడియంలోనే చదివి, రాసి తెలుగుకు పట్టం కట్టిన ఈ అనితర సాధ్యుడిని చూసి ఇవ్వాళ తెలుగు భాష గర్వపడుతోందంటే అతిశయోక్తి కాదు. ఉపాధ్యాయునిగా వృత్తిని కొనసాగిస్తూనే 2006 నుంచి సివిల్స్ కోసం ప్రయత్నిస్తున్న ఈయన నాలుగో ప్రయత్నంలో తన కల సాకారం చేసుకున్నారు.  1వ తరగతి నుంచి సివిల్స్‌ వరకు మాతృభాష తెలుగులో చదివి ఆల్‌ ఇండియా స్థాయిలో ర్యాంకు సాధించడం నిజంగా చరిత్రే అని సివిల్స్‌ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
అఖిల భారత స్థాయిలో సివిల్స్‌ ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసంబ. తల్లిదండ్రులు రోణంకి అప్పారావు, రుక్మిణి వ్యవసాయ కూలీలు. అన్నయ్య కోదండరావు ఎస్‌బీఐలో మేనేజర్‌. పాఠశాల విద్య నుంచి ఇంటర్‌ వరకూ తెలుగు మీడియంలోనే పలాస మండంలో చదివారు. డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ(ఎంపీసీ)లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దూబచర్లలోని డైట్‌లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 2007లో డీఎస్సీ రాసి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ)గా ఎంపికయ్యారు. 
 
ప్రస్తుతం పలాస మండలం రేగులపాడులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గోపాల కృష్ణ సివిల్స్ కోచింగ్ కోసం వెళ్లినప్పుడు పొందిన అవమానాలు, చీత్కారాలను సవాలుగా తీసుకుని తన జీవిత స్వప్నాన్ని సాకారం చేసుకున్నానని చెప్పారు. సివిల్స్‌లో తర్ఫీదు పొందడానికి హైదరాబాద్‌ వచ్చిన తనకు ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదురయ్యాయని కన్నీటి పర్యంతమవుతూ మీడియాకు వివరించారు గోపాలకృష్ణ. 
 
ఏ కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లినా నువ్వు పనికిరావంటూ అడ్మిషన్‌ ఇవ్వడానికే నిరాకరించారని, అయినా దేవుని దయ, అమ్మానాన్నల దీవెనలు, అన్నయ్య కోదండరావు స్పూర్తి, స్నేహితుల సహకారంతో పట్టుదలతో చదివానన్నారు. చిన్నప్పుడు తాను పడ్డ బాధలు తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి ప్రతీకారంతో ఈ విజయాన్ని సాధించానని స్పష్టం చేశారు.
 
తమ ఊరికి కరెంట్‌ లేకపోతే దీపం వెలుగులో చదువుకున్నానని, ఇప్పటికీ తమ ఊరికి న్యూస్‌ పేపర్‌ అంటే ఏమిటో తెలియదని చెప్పారు. తనకు ఎటువంటి అలవాట్లూ లేవని, ఆకలి, ఇతర అవసరాలు లేకపోతే చదువే తన లోకమని, అందులోనే ఆనందం పొందుతానని అన్నారు. 
 
దినపత్రికల సంపాదకీయాలు, ప్రత్యేక కథనాలను క్రమం తప్పుకుండా చదివి నోట్స్ తీసుకుని చదవడం తనకెంతో ఉపయోగపడిందని చెబుతున్న గోపాలకృష్ణ ఆకలిని, అవమానాన్ని, మాతృభాష సాక్షిగా తిప్పికొట్టి తెలుగు మాత్రమే చదువుకుని అత్యున్నత ర్యాంకును సివిల్స్‌లో సాధించడం ఈ దేశంలో సామాన్యులు సాధిస్తున్న అద్బుత విజయాలకు ప్రతిబింబం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్‌లో ఔషధాల అమ్మకం విప్లవమా.. ప్రాణాంతకమా?