దేశంలో ఉండే గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఆంధ్రా విశ్వవిద్యాలయంలో గంజాయి కలకలం సృష్టించింది. ఇక్కడ పని చేసే సెక్యూరిటీ గార్డులే ఈ గంజాయిని విక్రయిస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన యూనివర్శిటీ పోలీసులు నలుగురు సెక్యూరిటీ గార్డులను అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. అలాగే, రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
యూనివర్శిటీలో గత కొన్ని రోజులుగా మత్తు పదార్థాలు విక్రయాలు జరుగుతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు మఫ్టీలో నిఘా వేశారు. ఈ క్రమంలో పక్కా సమాచారంలో విశాఖ త్రీ టౌన్ పోలీసులు గత శుక్రవారం రాత్రి గంజాయి ఉందన్న సమాచారంతో బీచ్ రోడ్డులో ఉన్న యోగా విలేజ్‌లో ఆగివున్న ఓ ఆటోలో సోదాలు చేశారు.
ఇందులో చిన్నచిన్న ప్యాకెట్లలో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ దందాలో ఏయూ భద్రతా అధికారి కారు డ్రైవర్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు భావిస్తున్నారు. ఈయన సహకారంతో సెక్యూరిటీ గార్డులు ఈ గంజాయిని విద్యార్థులకు చేరవేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు.