ఏపీలోని గుంటూరు నగర శివారు ప్రాంతాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోతున్నాయి. ఏ ప్రాంతంలో గ్యాంగ్ వార్ నానాటికీ పెరిగిపోతోంది. అల్లరి మూకల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. నడిరోడ్డుపైనే దాడులకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ఈ జిల్లాలోని మంగళగిరి రూరల్ పరిధిలో ఓ హోటల్ వద్ద అర్థరాత్రి సమయంలో టిఫన్, భోజనం సరఫరా చేయలేదన్న కోపంతో కొందరు యువకులు మద్యం సేవించి హోటల్‌ను ధ్వంసం చేసి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వారిని అడ్డుకున్న వాచ్‌మెన్‌ను కూడా కత్తితో పొడిచి భయభ్రాంతులకు గురిచేశారు.
అలాగే, గుంటూరు జిల్లా నల్లపాడు స్టేషన్‌కు కూతవేటు దూరంలోని స్వర్ణభారతి నగర్‌లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఈ ప్రాంతం నగరానికి దూరంగా ఉడటం, జన సంచారం లేకపోవడంతో అక్కడ ఏం జరిగినా పోలీసులకు తెలియడం లేదు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది.
ఆ ప్రాంతంలోని రెండు సామాజిక వర్గాలకు చెందిన యువకులు ఆధిపత్యం పోరులో భాగంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆ సమయంలో రోడ్డుపై నడిచి వెళుతున్న యువకుడిని బంధించి తీవ్రంగా కొట్టారు. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసుల్లో మాత్రం ఏమాత్రం చలనం లేదు.