Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రశాంతంగా ఎన్నిక నిర్వహణకు పటిష్ట బందోబస్తు : ఏడీజీపీ రవిశంకర్

ప్రశాంతంగా ఎన్నిక నిర్వహణకు పటిష్ట బందోబస్తు : ఏడీజీపీ రవిశంకర్
, శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (14:44 IST)
ఈ నెల 17వ తేదీన జరగబోయే తిరుపతి పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ఓటర్లు నిర్భయంగా ఓటేయాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి(సీఈవో) విజయానంద్ పిలుపునిచ్చారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో ఉన్న ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 17,11,195 మంది ఓటర్లకు 2,470 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా దృష్ట్యా వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 80 ఏళ్ల పైబడిన వృద్ధులకు మొదటిసారిగా  పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించామన్నారు.
 
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా 28 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారన్నారు. చిత్తూరు జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజక వర్గాలు, నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి, గూడూరు, సుళ్లూరు పేట, వెంకటగిరి... ఇలా ఏడు నియోజక వర్గాల పరిధిలో తిరుపతి పార్లమెంట్ విస్తరించి ఉందన్నారు. ఉప ఎన్నిక ఏర్పాట్లపై ఇప్పటికే రెండు జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. 
 
గ్రామ, వార్డు వలంటీర్లను ఎన్నికల విధుల నుంచి మినహాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయమై ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు జిల్లా అధికారులకు సమాచారమిచ్చామన్నారు. అభ్యర్థుల తరఫున పోలింగ్ ఏజెంట్లగా కూడా వలంటీర్లు వ్యవహరించకూడదన్నారు. పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ నిర్వహించనున్నామన్నారు.
 
80 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్...
తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో 17,11,195 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్ తెలిపారు. వారిలో విభిన్న ప్రతిభావంతుల ఓటర్లు 24,698 మంది, 80 ఏళ్లకు పైబడిన వారు 22,743 మంది ఉన్నారన్నారు. సర్వీసు ఓటర్లు 497 మంది, థర్డ్ జెండర్స్ 216 మంది ఉన్నారన్నారు. 80 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించామన్నారు. పోలింగ్ స్టేషన్ కు వెళ్లకుండా ఇంటి వద్దే ఓటేయడానికి ఆసక్తి చూపిన 80 ఏళ్ల పైబడిన వారి నుంచి ఇప్పటికే మొబైల్ టీమ్ ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సేకరించామన్నారు. 
 
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి...
తిరుపతి నియోజక వర్గ పరిధిలో 2,470 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్ తెలిపారు. ఎన్నిక సందర్భంగా 23 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నామన్నారు. కొవిడ్ దృష్ట్యా ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో 1500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఉండేదన్నారు. నియోజక వర్గ పరిధిలో 877 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. 
 
కేంద్ర బలగాల రక్షణలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. 37 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లను నియమించామన్నారు. 1,241 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేసేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కరోనా నిబంధనలు అమలు చేయాలని, మాస్కులతో పాటు శానిటైజర్ వినియోగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ తో పాటు తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలని స్పష్టంచేశామన్నారు. 
 
ఉప ఎన్నికకు ముగ్గురు కేంద్ర అబ్జర్వర్లు...
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా ముగ్గురు అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిందని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్ తెలిపారు. దినేష్ పాటిల్ సాధారణ అబ్జర్వర్ గా, రాజీవ్ కుమార్ పోలీసు అబ్జర్వర్ గా, ఆనంద్ కుమార్ ఎన్నికల వ్యయ అబ్జర్వర్ గా నియమితులయ్యారన్నారు. ఈ ముగ్గురు ఉప ఎన్నిక శైలిని పర్యవేక్షిస్తారని తెలిపారు. మైక్రో అబ్జర్వర్లగా 816 మందిని నియమించామన్నారు. 
 
నియోజక వర్గ బోర్డర్లు సీజ్...
 
ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గ బోర్డర్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బయట వ్యక్తులు నియోజక వర్గంలోకి ప్రవేశించడానికి వీలు లేకుండా బోర్డర్లను సీజ్ చేస్తున్నామన్నారు. పోలింగ్ లో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి ఇప్పటికే కొవిడ్ వ్యాక్సిన్ వేశామన్నారు. కొవిడ్ దృష్ట్యా పోలింగ్ సిబ్బంది కోసం 570 బస్సులు ఏర్పాటు వినియోగిస్తున్నామన్నారు. 
 
పటిష్ట బందోబస్తు ఏర్పాటు : శాంతి భద్రతల ఏడీజీ రవిశంకర్
తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని శాంతి భద్రతల ఏడీజీ రవిశంకర్ తెలిపారు. 23 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూట్ మొబైల్ టీమ్ ల ద్వారా శాంతి భద్రలు పర్యవేక్షిస్తామన్నారు. తిరుపతి నియోజక వర్గ సరిహద్దుల్లో 52 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాబోయే రెండ్రోజులు ఎంతో కీలకమన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్  ల ద్వారా నగదు, మద్యం, ఇతర పంపకాలను అడ్డుకుంటామన్నారు. 
 
సోషల్ మీడియాలో వచ్చే ఫిర్యాదులు స్వీకరించడానికి సోషల్ మీడియా మోనటరింగ్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఉప ఎన్నిక  సందర్భంగా రూ. 4.73 కోట్ల విలువ చేసే నగదు, మద్యం తదితరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 
తిరుపతి ఉప ఎన్నిక ఏర్పాట్లపై చిత్తూరు, నెల్లూరు జిల్లాల అధికారులతో గురువారం ఉదయం సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్ వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం బాటిల్‌లో పాముపిల్ల.. సగం తాగేశాక దిమ్మ తిరిగింది.. చివరికి?