రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు కన్నుమూశారు. ఈయన వయసు 83 యేళ్లు. వయోభారంతో పాటు అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన గురువారం ఉదయం హైదరాబాద్ నగరంలో మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని సఖినేటిపల్లిలోని స్వగృహానికి తరలించి ప్రజలు, నేతలు సందర్శనార్థం ఉంచారు. గురువారం మధ్యాహ్నం సోంపల్లిలోని శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు.
గత 2004-09 మధ్యకాలంలో ఆయన రాజోలు ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రస్తుతం వైకాపా ఉన్నారు. ఆయన తొలిసారి గత 1999లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగి ఏవీసూర్యనారాయణ రాజుపై విజయం సాధించారు. అల్లూరి కృష్ణంరాజు భార్య ప్రస్తుతం టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా కొనసాగుతున్నారు. వీరికి శ్రీనివాసరాజు, కృష్ణకుమారి, విజయ అనే కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాసరాజు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో స్థిరపడ్డారు.
కృష్ణంరాజు భౌతికకాయాన్ని గురువారం సఖినేటిపల్లిలోని ఆయన నివాసానికి తరలించి, మధ్యాహ్నం సోంపల్లిలోని శ్మశానవాటికలో అధికారిక లాంఛలనాతో అంత్యక్రియలు నిర్వహిస్తామని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు తెలిపారు.