ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రభావం రోజు రొజుకీ పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ స్వీయ జాగ్రతలు పాటించాలని డీజీపీ పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సంబంధిత శాఖలను తగు చర్యల నిమిత్తం సమాయత్తం చేసినట్లు వారు తెలిపారు.
పెరుగుతున్న కరోనా కేసుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్న దరిమిలా నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయదలిచామని, అందు నిమిత్తం పోలీసుశాఖకు ప్రజలందరూ సహకరించవలసిందిగా అభ్యర్థించారు.
పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు కరోనా నియంత్రణకు సంబంధించిన నియమాల గురించి ప్రజలకు తెలియ పరచడానికి తగిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
అదే విధంగా ఎన్ఫోర్స్మెంట్ కొరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాస్కులు ధరించని వారికి, కోవిడ్ నియమావళి పాటించని వారికి పెద్ద మొత్తం లో జరిమానాలు విధించేలా ఆదేశాలు ఇచ్చామని డీజీపి తెలిపారు.
అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయ వద్దని, నిత్యావసరాల కొరకు మరియు అత్యవసర సందర్భాలలో మాత్రమే బయటకు రావాలని ప్రజలను కోరారు. ఫంక్షన్స్, పార్టీలు వంటి వాటిని సాధ్యమైనంత తక్కువ మందితో జరుపుకోవడం లేదా వీలుంటే కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం ఉత్తమమన్నారు.
ఒక వేళ బయటకి వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించడం, సానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించటం మున్నగు నియమాలు అలవాటుగా మార్చుకోవాలని వారు సూచించారు. దుకాణాదారులు సైతం వినియోగదారులు భౌతిక దూరం పాటించే విధముగా చర్యలు తీసుకోవాలని తెలిపారు
పాఠశాలలు, కళాశాలల్లో బౌతిక దూరం ఉండేలా విద్యార్థులను కూర్చోబెట్టాలని, విద్యార్థులు కోవిడ్ నియమాలు ఖచ్చితంగా పాటించేలా చూడాలని పాఠశాల, కళాశాల యాజమాన్యాలు, విద్యా సంస్థల అధికారులకు సూచించారు.
ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ కలిగి ఉండి, కరోనా వ్యాప్తిని నియంత్రించాలని, సమాజ హితం కోసం పోలీస్ వారు చేపడుతున్న చర్యలకు ప్రజలు తమ సహకారం అందించాలని గౌరవ డిజిపి తెలిపారు.