కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి మంగళవారం నాడు 2 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయడంతో ఈ నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. బ్యారేజి వద్ద 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చే అవకాశం వుందనీ, కనుక కృష్ణా పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రజలు ఎంతో అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నిన్నటి నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ నీరు కూడా కృష్ణా నదిలోకి వస్తున్నాయి. మొత్తమ్మీద బ్యారేజీ వద్ద 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే ప్రమాదం వుందనీ, నది వద్దకు ఎవ్వరూ వెళ్లవద్దనీ, కృష్ణా పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా వుండాలని జిల్లా అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలావుంటే... గత ఏడాది విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తింది. ఈ నేపధ్యంలో వెలగేరు రెగ్యులేటర్ వద్ద బుడమేర వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు గాను ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వచ్చే రెండుమూడు రోజుల పాటు అతిభారీ వర్షం కురవనున్న నేపధ్యంలో సంబంధిత సిబ్బంది అప్రమత్తంగా వుండాలని సూచించారు.