Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో ఐదేళ్ళ బాలిక అపహరణ.. తితిదే విజిలెన్స్, నిఘా పనిచేస్తుందా...!

తిరుమలలో ఆదివారం ఐదేళ్ళ బాలిక అపహరణకు గురైంది. ఇది స్థానికంగా సంచలనం రేపుతోంది. తల్లిదండ్రులు పక్కన ఉండగా గుర్తుతెలియని వ్యక్తి చిన్నారిని అపహరించుకుని వెళ్ళడం చర్చనీయాంశంగా మారుతోంది. ఎప్పుడూ భక్తులత

తిరుమలలో ఐదేళ్ళ బాలిక అపహరణ.. తితిదే విజిలెన్స్, నిఘా పనిచేస్తుందా...!
, సోమవారం, 30 జనవరి 2017 (12:39 IST)
తిరుమలలో ఆదివారం ఐదేళ్ళ బాలిక అపహరణకు గురైంది. ఇది స్థానికంగా సంచలనం రేపుతోంది. తల్లిదండ్రులు పక్కన ఉండగా గుర్తుతెలియని వ్యక్తి చిన్నారిని అపహరించుకుని వెళ్ళడం చర్చనీయాంశంగా మారుతోంది. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే తిరుమలలో ఇలాంటి సంఘటన జరగడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. అసలు తిరుమలలో నిఘా, విజిలెన్స్ అధికారులు పనిచేస్తున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
 
అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం తూముచెర్ల గ్రామానికి చెందిన మహాత్మ, వరలక్ష్మిలు తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆదివారం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. వీరికి గది దొరకకపోవడంతో మాధవం వద్ద హాలులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఐదేళ్ళ నవ్యశ్రీ మహాత్మ, వరలక్ష్మి దంపతులకు పెద్దకుమార్తె. దంపతులిద్దరూ గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా హాలులోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తి నేరుగా నవ్యశ్రీ వద్దకు వెళ్ళి చిన్నారిని అపహరించుకుని వెళ్ళాడు. చిన్నారిని అపహరించే సమయంలో కిడ్నాపర్ నేరుగా వారి వద్దకే వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. 
 
భక్తులతో కిటకిటలాడే మాధవం హాలులో గుర్తుతెలియని వ్యక్తి నేరుగా వెళ్ళి చిన్నారిని అపహరించడం చర్చనీయాంశంగా మారుతోంది. నిందితుడు పాత నేరస్థుడుగానే పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుమలలో వందలాది మంది బాలబాలికలు ఉండగా నవ్యశ్రీనే ఎందుకు అపహరణకు ఎంచుకున్నారు. మాధవ నిలయంలోని హాలులోకి యువకుడు వెళ్ళడం ఎలాంటి ఆలోచన, వెతుకులాట లేకుండా నేరుగా బాలిక వద్దకు వెళ్ళడం, నిద్రిస్తున్న సమయంలోనే ఎత్తుకెళ్ళడం దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. మరో కోణం కూడా స్పష్టంగా వెల్లడైంది. హాలులోకి ప్రవేశించే సమయంలోనే దుప్పటి కప్పుకోవడం, బాలికను దుప్పటిలోపల ఉంచుకుని తీసుకెళ్ళడంలాంటి పరిణామాలతో యువకుడు అనుభవం ఉన్న నేరస్తుడుగా పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల్లో కనిపించకుండా జాగ్రత్తపడినట్లు అనుమానిస్తున్నారు. ఆదివారం ఉదయం 7.25గంటలకు నవ్యశ్రీని అపహరించినట్లు దృశ్యాలు చెబుతున్నాయి. నిందితుడి చిత్రాలకు కొంత స్పష్టత తీసుకువచ్చి పోలీసులు విడుదల చేశారు. 
 
ఇద్దరు బిడ్డలతో శ్రీవారికి మొక్కు చెల్లించుకోవడానికి తిరుమలకు వచ్చిన మహాత్మా, వరలక్ష్మి బాలిక అపహరణతో భోరున విలపిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ అకస్మాత్తుగా కనిపించకపోవడంతో దిక్కతోచని స్థితిలో అటూ, ఇటూ పరుగులు పెట్టారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను చూపించిన అనంతరం మరింత ఆందోళనకు లోనయ్యారు. అపహరణకు ఆధారాలు లభించడంతో ఎత్తుకెళ్ళిన వ్యక్తి ఏం చేస్తాడనే ఆందోళనతో విలపిస్తున్నారు. 
 
తిరుమలలో ఇంత జరుగుతుంటే తితిదే విజిలెన్స్, నిఘా అధికారులు ఏం చేస్తున్నారోనన్నది ప్రశ్నార్థకంగా మారింది. తిరుమలలో వారంరోజుల వ్యవధిలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నా తితిదే విజిలెన్స్, నిఘా అధికారులు మొద్దు నిద్రపోతున్నారా? అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు ఎప్పుడూ రక్షణ కల్పించాల్సిన పోలీసులు, టిటిడి విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులు ఏం చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత మరోసారి తితిదే విజిలెన్స్, నిఘా అధికారుల డొల్లతనం బయటపడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి కోసం ఆహ్వానించి.. అవమానించిన ఏపీ సర్కారు : జపాన్ ఆర్కిటెక్ట్ సంస్థ ఆరోపణలు