పశ్చిమగోదావరి: బడికి వెళ్లలేదనీ కన్నబిడ్డను చంపేసిన తండ్రి
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రామశింగవరంలో దారుణం జరిగింది. ఆ వివరాలను పరిశీలిస్తే... యలమర్తి రాజారత్నం, స్వరూపరాణి ఓ తోటలో పనిచేస్తూ అక్కడే జీవనం సాగిస్తుండేవారు. ఈ దంపతులకి ఒక కుమార్తె, ఇద్దరు
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రామశింగవరంలో దారుణం జరిగింది. ఆ వివరాలను పరిశీలిస్తే... యలమర్తి రాజారత్నం, స్వరూపరాణి ఓ తోటలో పనిచేస్తూ అక్కడే జీవనం సాగిస్తుండేవారు. ఈ దంపతులకి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె మల్లేశ్వరి(12) లింగపాలెం మండలం రంగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది.
గతనెల 22న మల్లేశ్వరి పాఠశాలకు వెళ్లనని తల్లితో చెప్పి మానేసింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి సాయంత్రం ఇంటికొచ్చి మల్లేశ్వరిని కొట్టాడు. దీంతో బాలిక స్పృహ తప్పింది. దీంతో తల్లిదండ్రులు మల్లేశ్వరిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మల్లేశ్వరి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తండ్రి ఈ విషయాన్ని నలుగురికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. తాను ఉంటున్న తోటలోనే బాలిక మృతదేహాన్ని పాతి పెట్టాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని భార్యని బెదిరించాడు.
కొద్దిరోజుల తర్వాత బాలిక స్పృహ కోల్పోయిందని ఆర్‌ఎంపీ వైద్యుడి ద్వారా విషయం తెలుసుకున్న రాజారత్నం అత్తమామలు లక్ష్మి, దుర్గయ్య మూడు రోజుల కిందట అతని ఇంటికి చేరుకున్నారు. మల్లేశ్వరికి ఓణీలు వేయిస్తామని, తమ ఇంటికి పంపించాలని అడిగారు. దీంతో బాలిక తల్లిదండ్రులు తటపటాయించారు. అనుమానం చెందిన కుటుంబసభ్యులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే బాలిక తండ్రి రాజారత్నం పరారయ్యాడు. పోలీసులు పరారీలో ఉన్న రాజారత్నం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.