రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు హిందూపురం నుంచి మంగళగిరి వరకు ఎడ్ల బండిపై వచ్చిన ఓ యువ రైతు ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంగళవారం కలిశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా నవీన్ అనే యువ రైతు ఎడ్ల బండిపై హిందూపురం నుంచి మంగళగిరికి వరకు 27 రోజుల పాటు 760 కిలోమీటర్లు ప్రయాణించి సురక్షితంగా చేరుకున్నారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆయన గత రెండు రోజులుగా పడిగాపులు కాస్తున్న విషయాన్ని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయం పవన్ దృష్టికి వెళ్లడంతో మంగళవారం ఉదయం రైతు నవీన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతుల సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతులు బాగు కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పవన్‌తో భేటీ అనంతరం రైతు నవీన్ మాట్లాడుతూ, రైతు సమస్య పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ సానుకూలంగా స్పందించారన్నారు. ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ముఖ్యంగా దళారీ వ్యవస్థ లేకుండా చేస్తామని మాట ఇచ్చారని నవీన్ హహర్షం వ్యక్తం చేశారు.