Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేస్‌బుక్‌.. ప్రేమ.. పగ... హత్య.. గుంటూరులో దారుణం

ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతి పిలిచిందనీ వెళ్లిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు ఫేస్‌బుక్ యువతిని పావుగా వాడుకుని తమ శత్రువును హత్య చేశారు. ఈ దారుణం గుంటూరు జిల్లా కంకిపాడు సమీపంలోని ప

Advertiesment
Facebook friendship
, శుక్రవారం, 23 జూన్ 2017 (09:21 IST)
ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతి పిలిచిందనీ వెళ్లిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు ఫేస్‌బుక్ యువతిని పావుగా వాడుకుని తమ శత్రువును హత్య చేశారు. ఈ దారుణం గుంటూరు జిల్లా కంకిపాడు సమీపంలోని పునాదిపాడులో జరిగింది. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షేక్‌ రఫీ (26) హోటల్‌ నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఫేస్‌బుక్‌, చాటింగ్‌, మెసెంజర్‌ వంటి సామాజిక మాధ్యమాలు అధికంగా వాడే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే ఊపిరి అనే ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను ప్రారంభించాడు. ఆ ఖాతాలో గత 15 రోజుల క్రితం ఓ యువతితో పరిచయం ఏర్పడింది. దీంతో నిత్యం ఆ యువతితో చాటింగ్‌ చేస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీ సాయంత్రం కంకిపాడు రావాలని ఆ యువతి చెప్పింది. దీంతో తన మిత్రుడు షేక్‌ అబ్దుల్‌ జబ్బా (మున్నా)(17)తో కలిసి మోటార్‌ సైకిల్‌పై రాత్రి 8 గంటలకు రఫీ కంకిపాడు చేరుకున్నాడు. పునాదిపాడులోని ఓ కార్పొరేట్‌ కాలేజీ వద్దకు చేరుకుని అక్కడ వేచివున్న ఆ యువతితో మాట్లాడుతుండగా, ఆటోలో వచ్చిన ఐదుగురు వ్యక్తులు రఫీ, మున్నాలపై కత్తులు, కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు.
 
ఈ దాడిలో రఫీ, మున్నా చెరోవైపు పరుగులు తీశారు. మున్నా చేతికి స్వల్ప గాయాలవగా అక్కడి నుంచి తప్పించుకొని మంగళగిరి పారిపోయి దాడి ఘటనను రఫీ బంధువులకు చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, కాలేజీ ఖాళీ ప్రదేశంలోని పచ్చగడ్డిలో రఫీ మృతదేహం కనిపించింది. తల, చేతిపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. 
 
రఫీ అన్న నాగూరు మిత్రుడు కనకారావు బంధువులే రఫీని హతమార్చారని భార్య రజియ, తల్లి ఫాతిమా ఆరోపించారు. గత నెల 2వ తేదీన మంగళగిరిలో కనకారావు హత్యకు గురయ్యాడన్నారు. ఆ హత్య కేసులో నాగూరు, రఫీతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అయితే హత్యలో రఫీ ప్రమేయం లేదని వదిలిపెట్టారని చెప్పారు. అప్పటి నుంచి రఫీపై కక్ష పెంచుకున్న కనకారావు బంధువులే ఈ హత్య చేశారని ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళ టెక్కీకి లైంగిక వేధింపులు.. గేర్ మార్చుతున్నట్టుగా మోకాళ్ళపై...