గత తెలుగుదేశం ప్రభుత్వంలో కీలక మంత్రులుగా ఉన్నవారిలో ఆదినారాయణ రెడ్డి ఒకరు. ఈయన గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి గెలుపొంది, ఆ తర్వాత టీడీపీలో చేరారు. అనంతరం మంత్రిగా పని చేశారు. అయితే, ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ, జగన్ సునామీ ధాటికి ఆయన ఓడిపోయారు. కడప లోక్‌సభ వైకాపా అభ్యర్థి వైఎస్. అవినాశ్ రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయారు.
ఈ నేపథ్యంలో కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ఉన్న తన నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి... తన నివాసం సమీపంలోనే స్థానిక యువకులతో కలిసి కబడ్డీ ఆడారు. ఎన్నికల్లో ఎదురైన ఓటమిని మరచిపోయేందుకు ఆయన కాస్త ఆటవిడుపుగా కబడ్డీ ఆడారు.
ఈ ఆటలో భాగంగా ఆయన కూతకు వెళ్లారు. అపుడు పంచె కాళ్ళకు అడ్డం పడటంతో బోర్లాపడిపోయారు. ఆ తర్వాత కబడ్డీ ఆడుతున్న యువకులతో పాటు.. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయన్ను పైకిలేపారు. ఆ తర్వాత తన ముఖాన్ని నీటితో కడుక్కుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.