Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అనుమానమే!

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అనుమానమే!
, శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (08:57 IST)
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై నీలి నీడలు అలముకుంటున్నాయి. 'రైల్వే జోన్లు, డివిజన్ల సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నాయి'... అంటూ రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ ఈ నెల 21న లోక్‌సభలో చేసిన ప్రకటన చేసిన నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్‌ విషయం మరోసారి చర్చనీయాంశమైంది.

రైల్వేల పునర్విభజన, హేతుబద్ధీకరణ అంశాలను పరిశీలిస్తున్నామని, పరిపాలనా సంస్కరణలు చేపడుతున్నామని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటన దేశీయ రైల్వేల వ్యవస్థను అగమ్యగోచరంలోకి, ఉత్తరాంధ్ర ప్రజలను ఆందోళనలోకి నెట్టేసింది.

దేశంలోని రైల్వే జోన్‌లు, డివిజన్‌లను కుదిస్తామంటూ సభలో చెప్పిన రైల్వే మంత్రి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ పనులపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ప్రకటన చేసి 18 నెలలైంది. డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్‌)ను విశాఖ రైల్వే అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి 15 నెలలు గడుస్తోంది.

అయినా, జోన్‌కు సంబంధించిన పనులు ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దీనిపై వాల్తేరు రైల్వే అధికారులను 'ప్రజాశక్తి' సంప్రదించగా, ఇక్కడి నుంచి పంపిన డిపిఆర్‌ ఇంకా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని తెలిపారు. దీంతో, రైల్వే శాఖ మంత్రి తాజా ప్రకటన ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నెలలు గడుస్తున్నా డిపిఆర్‌ను పరిశీలిస్తున్నారంటే, డివిజన్‌ను లేపేసిన మోడీ సర్కారు మనకు జోన్‌ నిజంగా ఇస్తుందా? లేక ప్రకటనలకే పరిమితం అవుతుందా? అనే చర్చ ఈ ప్రాంత రైల్వే ఉద్యోగుల్లోనూ జరుగుతోంది.

సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ పేరుతో ప్రత్యేక పోస్టును సృష్టించిన కేంద్రం... పూర్తి స్థాయి అధికారిని ఇవ్వలేదు. విజయవాడ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ (డిఆర్‌ఎం)నే ఏడాదిన్నర కాలంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఒఎస్‌డిగా కొనసాగిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా ఓటు అమరావతికే.. కేంద్రమంత్రి