ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు గురువారం ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ ఆందోళన కార్యక్రమానికి అనేక మంది భారీ సంఖ్యలో తరలిరానున్నారు. వీరిని అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీసులు ఇప్పటి నుంచే సిద్ధమయ్యారు. విజయవాడ వెళ్లే మార్గాల్లో భారీ సంఖ్యలో పోలీసులను మొహరిస్తున్నారు.
గురువారం ఛలో విజయవాడ కార్యక్రమానికి బుధవారం నుంచే భారీ సంఖ్యలో ఉద్యోగులు తరలి వెళుతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముందుగానే భారీ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఆయా మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
ప్రధానంగా బుక్కరాయ సముద్రం, నార్పల క్రాస్ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. హిందూపురంలో ఎన్జీవో నేత నరసింహులును గృహ నిర్బంధం చేశారు. అలాగే, కడప నుంచి విజయవాడకు వెళ్ళకుండా ఉద్యోగ సంఘాల ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు మొహరించారు.
ఒంగోలులో ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శరత్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నెల్లూరు, గూడూరులో ఉపాధ్యాయులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. వాకాడు, వరికుంటపాడులో ఉద్యోగులు కూడా ఊరి దాటి వెళ్లకుండా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే, నెల్లూరు జిల్లా నుంచి ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకున్నారు.