Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి: మంత్రి ముత్తంశెట్టి

యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి: మంత్రి ముత్తంశెట్టి
, గురువారం, 14 నవంబరు 2019 (07:20 IST)
యువత భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర యువజన సర్వీసులు, టూరిజం శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

సచివాలయం 3వ బ్లాకులోని మంత్రి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన యువజనుల సర్వీసుల శాఖ ప్రత్యేక వెబ్ సైట్ ను మంత్రి ప్రారంభించారు. దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉండగా అందులో 60 శాతం మంది యువత ఉండటం విశేషమన్నారు.

మన రాష్ట్రంలో కూడా యువత 60 శాతం మంది ఉన్నారని గుర్తు చేశారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సహకారంతో ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు తెలిపారు. యువతలో నైపుణ్యాలు, సంస్కృతీ సంప్రదాయాలు, ఉపాధి, శిక్షణలతో పాటు యువజనోత్సవాలను డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 18 విభాగాల్లో పోటీలను నిర్వహిస్తామన్నారు.

అందులో భాగంగా శాస్త్రీయ గానం, నృత్యం, సంగీత వాయిద్యం, జానపదం, జానపద గ్రూప్ సంగీతం, ఏకపాత్రాభినయం, ఉచ్ఛారణ మరియు మిమిక్రీ, మ్యాజిక్, వెంట్రిలాక్విజం, మోనో యాక్షన్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. అంతర్గత జిల్లా యువజన పరస్పర సహకార కార్యక్రమాలు కూడా ఈ పోటీల కిందకు వస్తాయన్నారు.

పలు జిల్లాల నుంచి యువతీ యువకులు వారి  సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించామన్నారు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను వేదికగా మలుచుకొని అందిస్తున్న సేవలను అత్యధికంగా సమాజంలో అణగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

యువతలో సంస్కృతీ సంప్రదాయాలు పెంపొందించే సమైక్యతా కార్యక్రమాలను 5 రోజుల పాటు నిర్వహించి వారిలో ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను పెంపొందించి సమాజానికి ఉపయోగపడే విధంగా యువతలో మార్పును తీసుకువస్తామన్నారు.

గతంలో జరిగిన కొన్ని సమాజ వ్యతిరేక కార్యక్రమాలను మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యువజన పార్లమెంట్ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రకృతి వైఫరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కొనేందుకు ప్రాథమికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యువతకు శిక్షణ అందిస్తామన్నారు.

వ్యవస్థాపక దినోత్సవాలు, దేశాన్ని పునరుద్ధరించే కార్యక్రమాలతో పాటు యువజన క్లబ్ లు, సంఘాలను బలోపేతం చేయనున్నామన్నారు. మహిళా శక్తిని అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు పోలీసు, న్యాయ, మహిళా సంఘాల సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు.

దేశ రక్షణ వ్యవస్థలో యువతకు తగిన తర్పీదునిచ్చి ఉద్యోగ కల్పన శిక్షణా కార్యక్రమాలను వెబ్ సైట్ లో పొందుపరుస్తున్నామన్నారు. రక్తదానం, అవయవదానం వంటి కార్యక్రమాల్లో యువతలో చైతన్యం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సమావేశంలో యువజన సర్వీసుల శాఖ ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్ సి.నాగరాణి, డా.ఇనియా నెహ్రూ, స్టేట్ ఇన్ఫర్మేషన్ అధికారి డా.వి.వి.వి.రమణ. సీనియర్ టెక్నికల్ డైరెక్టర్ ఎస్వీడీఎస్ రామకృష్ణ, జాయింట్ డైరెక్టర్ ఎంజి. చంద్రశేఖర్,టెక్నికల్ డైరెక్టర్, ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్) అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంఎంటీఎస్ ప్రమాదానికి పనిఒత్తిడే కారణమా?