ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండల రామచంద్రాపురంలో వధూవరులు డ్యాన్సే వేయాల్సిందేనంటూ ఓవర్గం పట్టుబట్టగా, మరో వర్గం అందుకు అంగీకరించలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య చెలరేగిన గొడవ చివరకు కొట్లాటకు దారితీసింది. దీంతో ఈ కొట్లాటలో పలువురికి గాయాలయ్యాయి.
పోలీసుల కథనం మేరకు... తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రామచంద్రపురంలో సోమవారం సుబ్రహ్మణ్యం, పూజితల వివాహ వేడుకలకు కుటుంబసభ్యులు ఘనంగా ఏర్పాట్లుచేశారు. పెళ్లికుమార్తె తరపు బంధువులంతా తాళ్లపూడి మండలం గజ్జరం నుంచి విచ్చేశారు. వివాహం అనంతరం విందు జరుగుతోంది. ఆ సమయంలో వధూవరులిద్దరూ డ్యాన్స్ చేయాలంటూ అక్కడున్న వారు ఒత్తిడి తెచ్చారు.
ఆడపిల్ల డ్యాన్స్ చేయడమేమిటని వధువు తరపు బంధువులు అభ్యంతరం తెలిపారు. మాటామాటా పెరిగి వరుడి కుటుంబ సభ్యులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ మహిళకు తల పగిలింది. మరో వ్యక్తికి చేయివిరిగింది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
కోరుకొండ సీఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం వధూవరులతో పాటు వేడుకల్లో పాల్గొన్నవారంతా ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.