Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

Advertiesment
ananda nilayam

ఠాగూర్

, ఆదివారం, 6 జులై 2025 (10:37 IST)
ఏపీలోని కాకినా జిల్లా గుండేపల్లి మండలం మల్లేపల్లి అనే గ్రామంలో ఆనంద నిలయం నమూనాలో రాయుడు గారి మిలిటరీ హోటల్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ హోటల్ శ్రీవారి ఆలయం నమూనాలో ఏర్పాటు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. 
 
తిరుమల ఆనంద నిలయం తరహాలో సెట్టింగ్ వేయడంపై భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తీవ్రంగా స్పందించారు.
 
తాజాగా ఆ హోటల్‌ను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాంసాహారం వడ్డిస్తూ, విందులు చేసుకునే ప్రదేశంలో హిందువులు ఆరాధ్యదైవంగా భావించే వెంకటేశ్వరస్వామి ఆలయ నమూనాను ఏర్పాటు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. 
 
'వ్యాపార ప్రదేశాల్లో భక్తితో స్వామివారి ఫొటో ఫ్రేములు పెట్టుకోవచ్చు. కానీ, ఏకంగా ద్వారపాలకులతో సహా ఆలయాన్ని తలపించే సెట్టింగులు వేయడం సరికాదు. ఈ ధోరణిని ఇప్పుడే అడ్డుకోకపోతే, భవిష్యత్తులో విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, అన్నవరం సత్యదేవుడి ఆలయాల నమూనాలను కూడా ఇలాగే ఏర్పాటు చేసే ప్రమాదం ఉంది' అని శ్రీనివాసానంద సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఈ వివాదాస్పద హోటల్ ఉన్న జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ తితిదే పాలకమండలి సభ్యుడిగా కూడా ఉన్నారని స్వామీజీ గుర్తుచేశారు. ఈ హోటల్‌ను ఆయన చేతుల మీదుగానే ప్రారంభించారని ప్రచారం జరుగుతోందని, కాబట్టి ఆయనే చొరవ తీసుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 
 
మరోవైపు, హోటల్ నిర్వాహకులు దీనిపై స్పందించారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి తమ కులదైవం అని ఆయనపై ఉన్న భక్తితోనే ఈ సెట్టింగును ఏర్పాటు చేశామని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ