Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సచివాలయంలో ఇక పూర్తిస్థాయిలో ఇ-ఫైలింగ్....

అమరావతి: సచివాలయంలోని ఫైల్స్ అన్నీ ఇ-ఆఫీస్ పద్దతిలో నిర్వహించాలని, పరిపాలనలో భౌతికమైన ఫైల్స్ (పేపర్‌లెస్) లేకుండా సచివాలయ అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఇ-ఆఫీస్ నిర్వ

సచివాలయంలో ఇక పూర్తిస్థాయిలో ఇ-ఫైలింగ్....
, సోమవారం, 19 జూన్ 2017 (21:19 IST)
అమరావతి: సచివాలయంలోని ఫైల్స్ అన్నీ ఇ-ఆఫీస్ పద్దతిలో నిర్వహించాలని, పరిపాలనలో భౌతికమైన ఫైల్స్ (పేపర్‌లెస్) లేకుండా సచివాలయ అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఇ-ఆఫీస్ నిర్వహణ, త్వరితగతిన ఫైళ్ల పరిష్కారం తదితర అంశాలపై సీఎస్ సచివాలయ ఉన్నతాధికారులకు కొన్ని సూచనలు చేశారు. 
 
కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ఇ-ఆఫీస్ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామన్నారు. కార్యదర్శి స్థాయి నుంచి ఏఎస్ఓ స్థాయి ఉద్యోగుల వరకు అందరూ ఇ-ఫైలింగ్ విధానం అనుసరించాలని పేర్కొన్నారు. త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, జవాబుదారీతనం, సామర్థ్యం పెంపుదల, త్వరితగతిన ఫైళ్ల పరిష్కరణ వంటి సూచనలు చేశారు. 
 
ఎస్ఓలు, ఏఎస్ఓలు గరిష్ట స్థాయిలో ఫైళ్లను పరిష్కరించేవిధంగా ఉన్నత స్థాయి కార్యదర్శులు చూడాలన్నారు. వారికి సమాన స్థాయిలో పనిని అప్పగించాలని పేర్కొన్నారు. వారి పనితీరును తరచూ సమీక్షించి,  ఇ-ఫైలింగ్ సరిగా చేయనివారిని గుర్తించి వారిలో నైపుణ్యం పెంచాలన్నారు. కొంతమంది ఏఎస్ఓలు ఏడాది కాలంలో ఒక్క ఇ-ఫైల్ కూడా పంపలేదని తెలిపారు. 
 
ఇ-ఆఫీస్ ఫైలింగ్‌లో చురుకుగా పని చేసినవారి ప్రతిభ గుర్తించి వారికి సర్టిఫికెట్లు ఇస్తామని, అందుకు గాను కార్యదర్శులు ప్రతిభ కనపరిచినవారి వివరాలు పంపాలని తెలిపారు. వివిధ శాఖల్లోని సలహా విభాగంలో ఉండే కార్యదర్శులు జాప్యంలేకుండా సలహాలను, సూచనలు 24 గంటల్లోగా పంపాలన్నారు. ఫైళ్లు త్వరగా పరిష్కారమవడానికి మంత్రులు, కార్యదర్శులు సమీక్షలు నిర్వహించి, ఆయా శాఖల పనితీరు మెరుగుపరచాలని చెప్పారు. 
 
సచివాలయంలో విజిలెన్స్, భూసేకరణ, పెద్ద ఎత్తున్న ఉన్న ఇతర ఫైల్స్ తో సహా పూర్తి స్థాయిలో అంతా ఇ-ఫైలింగ్ జరగాలని, అయితే ఏవైనా తప్పనిసరిగా భౌతికరూపంలోనే పంపించవలసిన ఫైల్స్ ను సీఎస్ అనుమతితోనే పంపాలన్నారు. 
 
ప్రభుత్వ ఈ ఏడాది 20,163 జీఓలు విడుదల చేసిందని, అయితే వాటిలో 46 శాతం ఎస్టాబ్లిష్ మెంట్ కు సంబంధించినవే ఉన్నాయని, వీటిని తగ్గించి, సామాన్య ప్రజలకు ఉపయోగపడేవి, ప్రభుత్వ విధానాలకు సంబంధించిన జీఓలు ఎక్కువగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 
 
ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఇ-ఫైలింగ్‌ని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ)వారు లెక్కించి నివేదిక ఇచ్చారని, ఏడాదికి 900 రోజుకు మూడు ఫైళ్లు పరిష్కరించినవారిని హై వాల్యూమ్‌గా, మిగిలినవారిని లోవాల్యూమ్‌గా గుర్తించారని తెలిపారు. ఫైల్‌ని 24 గంటల్లోగా పరిష్కరించినవారిని హైస్పీడ్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు. పదిమంది కార్యదర్శులు, 49 మంది ఏఎస్‌లు, 24 మంది ఎస్ఓలు హైవాల్యూమ్, హైస్పీడ్ కేటగిరి-1లో ఉన్నారని, 18 మంది సెక్రటరీలు, 22 మంది ఏఎస్‌లు, 210 మంది ఎస్ఓలు, 418 మంది ఏఎస్ఓలు లోవాల్యూమ్, లోస్పీడ్‌లో ఉన్నారని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటి పేరు ‘శ్రీ గోవిందం భవనం’... తలుపు తెరిస్తే అక్రమాస్తుల నిలయం... విశాఖ అవినీతి 'కింగ్'