తిరుమల ఆలయ మాడ వీధిలోనే తాగి వూగారు
తిరుమల. ఈ పేరు వింటేనే భక్తి భావం రెట్టింపవుతుంది. అసలు ఆ పేరు చెవినపడగానే చేతులెత్తి దండం పెడతాం. అలాంటి పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసేలా వ్యవహరించారు కొంతమంది యువకులు. అది కూడా ఒకరిద్దరు కాదు. ఏకంగా ఆరుగురు. శ్రీవారి ఆలయం తిరువీధులలోని గ్యాలరీలో ఏ
తిరుమల. ఈ పేరు వింటేనే భక్తి భావం రెట్టింపవుతుంది. అసలు ఆ పేరు చెవినపడగానే చేతులెత్తి దండం పెడతాం. అలాంటి పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసేలా వ్యవహరించారు కొంతమంది యువకులు. అది కూడా ఒకరిద్దరు కాదు. ఏకంగా ఆరుగురు. శ్రీవారి ఆలయం తిరువీధులలోని గ్యాలరీలో ఏకంగా మద్యం బాటిళ్ళను ఉంచుకుని తాపీగా కూర్చున్నారు. గంటకుపైగా అదే ప్రాంతంలో కూర్చున్నారు. ఈ తతంగమంతా చూసిన కొంతమంది భక్తులు గోవిందా..గోవిందా అపచారమంటూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. మరికొంతమంది ఆ యువకులతో వాగ్వాదానికి దిగడానికి ప్రయత్నిస్తే వారు చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
అయితే విషయం మీడియాకు తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్ళిన మీడియాపై దౌర్జన్యానికి దిగారు యువకులు. మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి అంటూ బూతుల పురాణం మొదలెట్టారు. ఇంతలో తితిదే విజిలెన్స్, నిఘా అధికారులు రంగంలోకి దిగారు. వారిని చూసిన యువకులు పరుగులు తీశారు. అందులో శీను, నవీన్, బాలాజీ అనే యువకులను మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురు అక్కడి నుంచి మెల్లగా పరారయ్యారు. పరారైన వారి కోసం తితిదే విజిలెన్స్, నిఘా అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. నిందితుల్ని పోలీసులకు అప్పజెప్పారు.
అసలు.. భక్తులందరినీ తనిఖీ చేసే పంపించే తితిదే సిబ్బంది వీరిని ఏ విధంగా తిరుమలకు పంపించారన్నదే అనుమానంగా మారింది. తితిదే విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది కళ్ళుకప్పి యువకులు మద్యం తెచ్చుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తితిదే విజిలెన్స్, నిఘా అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇదిలా ఉంటే యువకులు ఏకంగా శ్రీవారి తిరువీధులలో గంటల తరబడి కూర్చుని మరీ మద్యం సేవించారంటే సెక్యూరిటీ సిబ్బంది ఏమయ్యారన్నది మరో ప్రశ్న. ఆలయం చుట్టూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా గస్తీ సిబ్బంది పట్టించుకోకపోవడం విడ్డూరం. ఇలాంటి సంఘటనలు మరోసారి జరుగకుండా జాగ్రత్త పడాలని భక్తులు కోరుతున్నారు.