ఆంధ్రప్రదేశ్ లోని బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేగా డాక్టర్ సుధ ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు.. 1,46,545. ఇందులో వైసీపీకి 1,11,710 ఓట్లు పోలయ్యాయి. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి సురేష్ కు 21,621 వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిని మాజీ ఎమ్మెల్యే కమలమ్మకు 6,205 ఓట్లు వచ్చాయి. నోటాకి 3,629 ఓట్లు పడటం ఇక్కడ విశేషం.
మొత్తం మీద బద్వేలులో వైసీపీకి ఫైనల్ మెజారిటీ 90,228 ఓట్లు వచ్చాయి. బద్వేలు బైపోల్ ఫలితాలు ఎవరికీ పెద్ద ఆశ్చర్యాన్ని ఉత్కంఠను కలిగించలేదు. ఇక్కడ వైసీపీ గెలుస్తుందని అందరికీ తెలుసు. అయితే, మెజారిటీ ఎంత వస్తుందనేది ఊహాగానాలు నడిచాయి. మాజీ ఎమ్మెల్యే చనిపోవడంతో ఆయన భార్య డాక్టర్ సుధకు వైసీపీ టిక్కెట్ ప్రకటించింది. సంప్రదాయంగా వస్తున్న రాజకీయ ఆచారంగా తాము చనిపోయిన ఎమ్మెల్యే భార్యకు సీటు ఇచ్చారు కాబట్టి, పోటీ నుంచి వైదొలగుతున్నామని తెలుగుదేశం, జనసేన ప్రకటించాయి. దీనితో వైసీపీకి విజయం నల్లేరుపై నడక అయింది. కానీ, మరో పక్క కాంగ్రెస్, బీజేపీలు తాము మాత్రం బరిలో ఉంటామని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. సునాయాసంగా గెలిచే వైసీపీకి ఎదురు వీరెందుకు నిలబడుతున్నారనే అనుమానాలు వ్యక్తం అయ్యయి. అంతా అనుకున్నట్లే, జాతీయ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కలేదు. వైసీపీ ఇక్కడ మరోసారి ఘనవిజయాన్ని సాధించింది.