Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోదావరి - కృష్ణా నదుల అనుసంధానంపై డీపీఆర్‌ సిద్ధం

Advertiesment
DPR
, మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (08:28 IST)
గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదులకు నీటి మళ్ళింపు కోసం నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యుడీఏ) ముసాయిదా ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీ సభ్యులు వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.

దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఆదుకునేందుకు గోదావరి నది బేసిన్‌ నుంచి కృష్ణా నది బేసిన్‌కు నీరు మళ్ళించే అవకాశాలను పరిశీలించివలసిందిగా కోరుతూ గత ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ గోదావరి - కృష్ణా నదుల అనుంసంధానం ప్రాజెక్ట్‌కు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరినట్లు మంత్రి చెప్పారు.

గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధానంపై సవివరమైన ప్రాజెక్ట్‌ నివేదికను రూపొందించే బాధ్యతను ఎన్‌డబ్ల్యుడీఏకు అప్పగించినట్లు మంత్రి తెలిపారు. ఆ సంస్థ సిద్ధం చేసిన ముసాయిదా డీపీఆర్‌పై  తమ అభిప్రాయాలను తెలపవలసిందిగా కోరుతూ సంబంధిత రాష్ట్రాలకు పంపించినట్లు షెకావత్‌ చెప్పారు.

గోదావరి - కావేరీ లింక్‌ ప్రాజెక్ట్‌లో ప్రధానంగా మూడు లింక్‌లు ఉంటాయి. అవి గోదావరి (ఇంచంపల్లి లేదా జానంపేట), కృష్ణా (నాగార్జునసాగర్‌) లింక్‌, కృష్ణా (నాగార్జునసాగర్‌) పెన్నా (సోమశిల) లింక్‌, పెన్నా (సోమశిల), కావేరీ (గ్రాండ్‌ ఆనకట్ట) లింక్‌ అని చెప్పారు. ఈ లింక్‌ ప్రాజెక్ట్‌ల ద్వారా నిరుపయోగంగా పోతున్న 247 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు.

గోదావరి-కృష్ణా లింక్‌ ప్రాజెక్ట్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 3.45 లక్షల నుంచి 5.04 లక్షల హెక్టార్ల భూములకు ఏటా సాగునీటి వసతి కల్పించవచ్చని చెప్పారు. అలాగే నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాల్వల కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించవచ్చు.

నదుల లింకింగ్‌ ప్రాజెక్ట్‌పై సంబంధిత రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించిన అనంతరం తుది డీపీఆర్‌ను రూపొందించి, చట్టపరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాత ప్రాజెక్ట్‌ పనులు మొదలవుతాయని ఆయన తెలిపారు.

 
సాగరమాల కింద ఏపీలో 32 రోడ్డు, 21 రైల్‌ ప్రాజెక్ట్‌లు
సాగరమాల కార్యక్రమం కింద దేశంలో కొత్తగా అభివృద్ధి చేయడానికి తలపెట్టిన 91 రోడ్డు, 83 రైల్‌ ప్రాజెక్ట్‌లలో ఆంధ్రప్రదేశ్‌కు 32 రోడ్డు, 21 రైల్‌ ప్రాజెక్ట్‌లు కేటాయించినట్లు నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ తెలిపారు.

రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పోర్టులకు సరకుల రవాణాను వేగవంతం, సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా రోడ్డు, రైల్‌ ప్రాజెక్ట్‌లు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. రోడ్డు ప్రాజెక్ట్‌లలో కొన్ని పూర్తయ్యాయి. 
 
మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. మరికొన్ని డీపీఆర్‌ రూపకల్పన దశలో ఉన్నాయని ఆయన వివరించారు. రైల్‌ ప్రాజెక్ట్‌లలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు చెప్పారు.
 
ఏపీలోని 9 జిల్లాల్లో సాంప్రదాయ పారిశ్రామిక క్లస్టర్లు
సాంప్రదాయ పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధితో ఒక పథకాన్ని ప్రారంభించినట్లు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల మంత్రి నితిన్‌ గడ్కరీ రాజ్యసభలో చెప్పారు.

వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఈ పథకంలో భాగంగా ఖాదీ, కాయర్‌, విలేజ్‌ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో సాంప్రదాయక పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసి అందుకు తగిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు (కలంకారీ ఉత్పాదనలు), విజయనగరం (కాయర్‌ పరుపుల తయారీ), చిత్తూరు (కాయర్‌ ఉత్పాతదనలు), కృష్ణా (కొండపల్లి బొమ్మలు), తూర్పు గోదావరి (జొన్నాడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌), చిత్తూరు (చింతపండు ఉత్పాతదనలు), గుంటూరు (మంగళగిరి బంగారు ఆభరణాల తయారీ), తూర్పు గోదావరి (కొబ్బరి నార ఉత్పాదనలు), తూర్పు గోదావరి (కడియపులంక కొబ్బరిపీచు ఉత్పాదనలు) జిల్లాల్లో మొత్తం 9 సాంప్రదాయ పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళల పట్ల మతపరమైన వివక్షపై సుప్రీం ప్రశ్నాపత్రం