కన్నతల్లి తర్వాత ఆ స్థానం అత్తది అంటారు పెద్దలు. అయితే చిత్తూరు జిల్లాలో ఒక అత్త సూర్యకాంతంలా మారిపోయి అదనపు కట్నం కోసం కోడలిని వేధించింది. దీంతో మనస్థాపానికి గురైన కోడలు ఇంటిలోనే ఆత్మహత్యకు పాల్పడింది.
చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం తెల్లగుండ్లపల్లె దళితవాడకు చెందిన రూపవతి (25), రామచంద్రాపురం మండలం కుప్పం బాదూరుకు చెందిన సతీష్‌కు రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక సంవత్సరం బాబు ఉన్నాడు. ప్రస్తుతం రూపవతి నాలుగునెలల గర్భిణి. వివాహం సమయంలో అడిగిన కట్నాన్ని రూపవతి తల్లిదండ్రులు ఇవ్వలేదు.
వివాహం తర్వాత మెల్లమెల్లగా ఇస్తామని చెప్పారు. అయితే వివాహమై రెండు సంవత్సరాలు కట్నం ఇవ్వకపోవడంతో ప్రతిరోజు అత్త రాజమ్మ, భర్తలు వేధిస్తూ వచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన రూపవతి శనివారం ఉదయం ఇంటిలో అందరూ నిద్రిస్తుండగా ఇనుపరాడ్డుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
మృతురాలి బంధువుల ఫిర్యాదుతో అత్త, భర్తలను తవణంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.