కంటైన్మెంట్ ప్రాంతాల లోపల వాటి వెలుపల హైరిస్క్,60 యేళ్ళు పైబడిన వారందరినీ స్క్రీనింగ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.
కరోనా నియంత్రణ చర్యలపై శుక్రవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ వనరబుల్ గ్రూపులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారందరినీ స్క్రీనింగ్ చేయడం ద్వారా కరోనా వైరస్ విస్తరణ నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని పునరుద్ఘాటించారు.
అదే విధంగా కాంట్రాక్టు ట్రేసింగ్ సక్రమంగా నిర్వహించడం ద్వారా వైరస్ విస్తరణను అదుపు చేయవచ్చని ఆదిశగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.
ఆరోగ్య సేతు యాప్‌ను స్మార్ట్ ఫోన్, జియో ఫోన్లలోను డౌన్‌లోడ్ చేసుకునేలా చూడాలని సిఎస్ నీలం సాహ్ని చెప్పారు. ఆసుపత్రుల సన్నద్ధత చర్యలపై ఆమె మాట్లాడుతూ.. ఆక్సిజన్ సిలిండర్లుతో కూడిన పూడికలు అందుబాటులో ఉండేలా చూడడం వంటి వివిధ అంశాలను జిల్లా కలెక్టర్లు స్వయంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాల్లో హెచ్ ఆర్ సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చి వారి సేవలను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో మన రాష్ట్రం దేశంలో మెరుగైన చర్యలు తీసుకుంటోందని ఈ కృషిని మరింతగా కొనసాగించాలని చెప్పారు.
ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు విషయంలో పీక్ స్థాయికి చేరుకుంటున్న నేపధ్యంలో జిల్లాల్లో కేసుల సంఖ్య అధికంగా నమోదు అవుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా వైరస్ వ్యాప్తి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాల నుండి వలస కూలీలు ఇతరులు రాష్ట్రానికి వస్తున్న నేపధ్యంలో సరిహద్దు జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సిఎస్ స్పష్టం చేశారు.
ఇళ్ళ నుండి బయిటకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి అంశాల్లో ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన పెంపొందించేందుకు ఐఇసి కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు.
ఈ విషయంలో డ్వాక్రా,డ్వాక్వా సంఘూలను పెద్ద ఎత్తున భాగ స్వాములను చేయాలని సిఎస్ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వైయస్సార్ గ్రామ క్లినిక్లు,రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ కంటైన్మెంట్ క్లస్టర్ల లో ప్రత్యేక దృష్టి పెట్టి మరణాలు, కమ్యునిటీ స్ప్రెడింగ్ ను తగ్గించే లక్ష్యంతో హైరిస్క్ లో ఉన్న వారందరికీ టెస్టులు నిర్వహించాలని చెప్పారు.
అంతేగాక కంటైన్మెంట్ క్లస్టర్ల లోపల వెలుపల హైరిస్క్ వారిని నూరు శాతం స్క్రీనింగ్ చేయాలని ఆయన స్పష్టం చేశారు.అదేవిధంగా షుగర్,హై బ్లడ్ ప్రెషర్ తో ఉన్న వారందరికీ 15రోజుల వరకూ మందులు పంపిణీ చేయాలని అన్నారు.
పాజిటివ్ కేసులన్నిటినీ డాక్యుమెంటేషన్ చేయాలని చెప్పారు. జిల్లాల్లో హెచ్ ఆర్ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చి వారి సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన చెప్పారు.కోవిడ్ కేర్ సెంటర్లు మరింత చురుగ్గా పనిచేసేలా చూడాలన్నారు.
వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్, ఆరోగ్య శ్రీ సిఇఒ మల్లికార్జున్,వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.