కూలీ కలెక్టర్ .. కేరళ వరద బాధితుల కోసం మూటలు మోశాడు..
కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా సాయం చేశారు. కొందరు ధన సాయం చేస్తే.. మరికొందరు వస్తు రూపంలో సాయం చేశారు. ఇలా పలువురు పలు విధాలుగా ఆపన్నహస్తం అందించారు.
కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా సాయం చేశారు. కొందరు ధన సాయం చేస్తే.. మరికొందరు వస్తు రూపంలో సాయం చేశారు. ఇలా పలువురు పలు విధాలుగా ఆపన్నహస్తం అందించారు. ఇలాంటి వారిలో ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన ఓ కలెక్టర్ కూడా ఉన్నారు. ఈయన ఏకంగా కూలీ అవతారమెత్తారు. కేరళ సహాయక చర్యల్లో కష్టించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ స్థానిక అధికారి కలెక్టర్‌ను గుర్తు పట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
2012 బ్యాచ్‌కు చెందిన కన్నన్ గోపీనాథన్ సొంత రాష్ట్రం కేరళ. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలిలో కలెక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరుపున కోటి రూపాయలు సాయం చేయడానికి ఆగస్టు 26వ తేదీన తిరువనంతపురానికి వెళ్లారు. డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేసిన గోపీనాథన్… తిరిగి దాద్రనగర్ హవేలికి వెళ్లలేదు. అక్కడి నుంచి బస్సు ఎక్కి నేరుగా బస్సులో పథనంతిట్ట అనే ఊరుకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యల్లో భాగమయ్యారు.
ఇళ్లల్లోని బురదను తొలగించడం.. బాధితులకు ఆహార పదార్థాలు అందించడం… లారీల్లో వచ్చిన వస్తు సామాగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం… తదితర పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. ఓ కూలీగా మారి ఉదయం నుంచి సాయంత్రం వరకు మూటలు మోశారు. అక్కడ కొన్ని రోజులు పనిచేసిన తర్వాత అళప్పుళ, చెంగనూరు గ్రామాల్లో జరిగిన సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఇలా.. 8 రోజులు పనిచేసిన ఈయన… కేరళ బుక్స్ అండ్ పబ్లికేషన్స్ సొసైటీ ఆఫీసులో సహాయక చర్యలు చేస్తుండగా… ఓ సీనియర్ అధికారి గుర్తించారు. ఆ తర్వాత దాద్రానగర్ హవేలికి గోపీనాథ్ వెళ్లిపోయారు. హోదాను పక్కనపెట్టి.. ఆపదలో సామాన్యుడిగా సేవ చేసిన కలెక్టరును పలువురు అభినందిస్తున్నారు.