మన దేశంలోని అనేక ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు, ఆచారాలు ఉన్నాయి. ముఖ్యంగా, గ్రామీణ భారతంలో ఇవి ఇప్పటికీ అనుసరిస్తున్నారు. నిరక్ష్యరాస్యులు మాత్రమే కాదు.. విద్యావంతులు సైతం వీటిని బలంగా నమ్ముతున్నారు. హైటెక్ ప్రపంచంలోనూ ఇలాంటి మూఢ నమ్మకాలు, ఆచారాలను పాటిస్తుండటం కాస్త ఆశ్చర్యగా, వింతగాను ఉంటుంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండంలోని తలారి చెరువు అనే గ్రామంలో ప్రజలు ఓ వింత ఆచారాన్ని పాటిస్తుంటారు. ప్రతి యేటా మాఘ మాస పౌర్ణమి వస్తే చాలు ఆ గ్రామస్థులంతా కట్టుబట్టలతో ఊరు వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు.
దీనికి కారణం లేకపోలేదు. ఈ గ్రామంలో ఒకపుడు బ్రాహ్మణుడుని హత్య చేశారట. ఆ పాపం తమ వారసులకు అంటుకోరాదని ఆ గ్రామస్థులంతా మాఘమాసం పౌర్ణమి రోజున ఊరు వదలి వెళ్లిపోతుంటారు. అదీకూడా కట్టుబట్టలతో తమ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న హాజీవలి దర్గాకు వెళ్లి అక్కడ ఒక రోజంతా అంటే 24 గంటల పాటు బస చేస్తారు.
ఇక్కడకు వెళ్లేవారంతా ఒక రోజుకు సరిపడా ఆహారం చేసుకునేందుకు వీలుగా వంటసామాగ్రిని తీసుకెళ్ళి చెట్ల కింద వంట చేసుకుని ఆరగిస్తారు. రాత్రికి దర్గాలోనే నిద్రించి మరుసటి రోజున తమ గ్రామానికి వస్తుంటారు. ఈ మాఘమాసం పౌర్ణమి రోజున తలారి చెరువు గ్రామంలో ఒక్క మనిషి కూడా ఉండరు. గత 500 యేళ్ళుగా ఈ ఆచారం పాటిస్తున్నారు. ఆ ఒక్క రోజు రాత్రి గ్రామంలో కనీసం గుడ్డి దీపాన్ని సైతం వెలిగించరు.