జనవరి 26న రిపబ్లిక్ డే ఉత్సవాలను విశాఖలో నిర్వహించాలని తలపెట్టిన ఏపీ సర్కారు తాజాగా మనసు మార్చుకుని విజయవాడలోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు.
రిపబ్లిక్ డే పరేడ్ విశాఖ నుంచి విజయవాడకు తిరిగొచ్చిందని, రాజధాని కూడా విశాఖ నుంచి అమరావతికి తిరిగొస్తుందని వ్యాఖ్యానించారు. ఇక, శాసనమండలి అంశంపైనా ఉమ వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు ఏంపని? అని ప్రశ్నించారు.
మండలి సమావేశాలు జరుగుతున్న తీరును విజయసాయి గ్యాలరీలో కూర్చుని వీక్షించడమే కాకుండా, సభలో జరిగిన అన్ని వివరాలను సీఎం చాంబర్ లో జగన్ కు నివేదించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
రైతులు, మహిళలపై పోలీసుల పాశవికంగా ప్రవర్తిస్తున్నారని, 24 మంది రైతులు చనిపోయినా జగన్ లో కానీ, మంత్రుల్లో కానీ పశ్చాత్తాపం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అని కూడా చూడకుండా గల్లా జయదేవ్ పై తప్పుడు సెక్షన్లు మోపారని దేవినేని ఉమ ఆరోపించారు. కొడాలి నాని, ఇతర మంత్రుల తీరు, భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని మండిపడ్డారు.