నర్సాపురం వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు కాలికి తగిలిన గాయాలపై గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో హైకోర్టు ఆదేశం మేరకు ఏ మెడికల్ బోర్డు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. రఘురామకృష్ణరాజుకు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నిరకాల పరీక్షలు చేయిస్తున్నారు.
రఘురామ సొరియాసిస్‌తో బాధపడుతున్నట్టు గుర్తించారు. దాంతో డెర్మటాలజీ పరీక్షలు కూడా చేయిస్తున్నారు. ఈ వైద్య పరీక్షలపై నివేదిక కోసం సీఐడీ కోర్టు ప్రత్యేకంగా మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ మెడికల్ బోర్డుకు జీజీహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ ప్రభావతి నేతృత్వం వహిస్తున్నారు.
అయితే, ఆదివారం 12 గంటల లోపే రఘురామ వైద్యపరీక్షల నివేదిక ఇవ్వాల్సి ఉన్నా, ఇప్పటివరకు నివేదిక రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరుగుతోంది అంటూ వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం, రమేశ్ ఆసుపత్రిలోనూ పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, జీజీహెచ్‌లోనే ఇంకా పరీక్షలు పూర్తికాకపోవడంతో, రమేశ్ ఆసుపత్రికి ఎప్పుడు తరలిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.
ఇదిలావుంటే, తన తండ్రి రఘురామకృష్ణరాజును అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆయన తనయుడు కనుమూరి భరత్ ఆక్రోశిస్తున్నారు. ఈ క్రమంలో భరత్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు.
పోలీస్ కస్టడీలో తన తండ్రిని చిత్రహింసలకు గురిచేశారని భరత్ తన లేఖలో ఆరోపించారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. భరత్ తన లేఖతో పాటు రఘురామ కాలి గాయాల ఫొటోలను కూడా జోడించారు.
ఏపీలో భారత రాజ్యాంగం అమలు కావడం లేదని, రాష్ట్రంలో అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వెలిబుచ్చారు. తన తండ్రిని ఏపీ సీఐడీ అధికారి సునీల్ కుమార్ బృందం ఈ నెల 14న అదుపులోకి తీసుకుందని, విచారణ పేరుతో రాత్రంతా హింసించారని భరత్ వెల్లడించారు.
ఓ ఎంపీ అని కూడా పట్టించుకోకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. పోలీసుల దెబ్బలకు ఆయన శరీరంపై గాయాలు తగిలాయని, సరిగా నడవలేని స్థితిలో ఉన్నారని వివరించారు.
అవి కొట్టడం వల్ల ఏర్పడిన దెబ్బలే అయితే కఠినచర్యలు తప్పవని కోర్టు కూడా పోలీసులను హెచ్చరించిన విషయాన్ని భరత్ తన లేఖలో ప్రస్తావించారు. చట్టాలు, రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించరాదని తన లేఖలో కోరారు.