అండమాన్ వద్ద బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి స్థిరంగా ఉందని, ఇది గురువారం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని గోపాల్ పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌దాస్ తెలిపారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ అల్పపీడనం ఈ నెల 22వ తేదీలోగా వాయుగుండంగాను, 23వ తేదీకి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. తూర్పు కేంద్ర బంగాళాఖాతం నుంచి ఈ విపత్తు పశ్చిమ కేంద్ర బంగాళాఖాతానికి చేరువవుతుందని, ఆ తర్వాత మళ్లీ దిశ మార్చుకుని తీరంవైపు వస్తుందని చెప్పారు.
తుఫాను తీవ్రత, ఎక్కడ తీరాన్ని దాటుతుందన్నదానిపై ఇంకా స్పష్టత లేదని, 22న పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ నేపథ్యంలో సముద్ర ఉపరితలంలో 22వ తేదీ నుంచి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందన్నారు. చేపల వేట నిషేధించినట్లు వెల్లడించారు.