Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తీవ్రరూపం దాల్చిన మొంథా : నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు

Advertiesment
rain in telangana

ఠాగూర్

, మంగళవారం, 28 అక్టోబరు 2025 (13:28 IST)
మొంథా తుఫాను తీవ్రరూపందాల్చింది. ఈ కారణంగా చెన్నైతో పాటు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన ఆయా జిల్లాల అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు ప్రారంభమయ్యాయి.
 
కాగా, నెల్లూరు జిల్లాలోని 38 మండలాల్లో మొత్తం 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటున 3.7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో అత్యధికంగా 16.6 మి.మీ. వర్షం కురవగా, ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరంలో అత్యల్పంగా 1 మి.మీ. మాత్రమే నమోదైంది. జిల్లాలోని 10 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. 
 
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎండగా ఉన్న వాతావరణం, ఆ తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. మైపాడు, కృష్ణపట్నం, రామాయపట్నం తీర ప్రాంతాల్లో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. బలమైన ఈదురుగాలులతో అలలు ఎగిసిపడుతున్నాయి.
 
ఎగువన ఉన్న కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో సోమశిల జలాశయం తన పూర్తిస్థాయి నీటిమట్టమైన 78 టీఎంసీలకు చేరువవుతోంది. దీంతో సోమశిల డ్యామ్ పరిసర గ్రామాలు ముంపునకు గురికాకుండా అధికారులు ముందుజాగ్రత్తగా వరద నీటిని పెన్నా నదిలోకి విడుదల చేస్తున్నారు. 
 
తుపాను పరిస్థితులపై జిల్లా ప్రత్యేక అధికారి యువరాజ్, కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే బలవంతంగానైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన స్పష్టం చేశారు. 
 
తుపానును ఎదుర్కొనేందుకు అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని కలెక్టర్ శుక్లా తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 144 పునరావాస కేంద్రాలు ఆదివారం రాత్రి నుంచే పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగకుండా కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఒక సెల్ టవర్ను కూడా ఏర్పాటు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొంథా తుఫాను : కూలిపోయిన ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు.. కనెక్టివిటీ తెగిపోయింది..(video)