మొంథా తుఫాను నత్తలా చాలా నెమ్మదిగా కదులుతూ వస్తోంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలి వస్తున్న తుఫాను ప్రస్తుతం కాకినాడకు 530 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ తుఫాను పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంగా పెనుగాలులు వీచే అవకాశం వున్నట్లు అధికారులు తెలియజేసారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో అధికారులు ప్రజలను అప్రత్తం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
మొంథా తుఫాన్ రూపంలో ముంచుకొస్తున్న పెను విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది. సహాయక చర్యలను మరింత సమర్థంగా, వేగంగా చేపట్టే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. తుపాను సహాయక చర్యలకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)తో సమన్వయం చేసుకునే గురుతర బాధ్యతను లోకేశ్‌కు కేటాయించారు.
సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంథా తుపానుపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుపాను సమయంలో ఒక్క ప్రాణం కూడా పోకూడదని, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం కావాలని ఆయన స్పష్టం చేశారు. తుఫాన్ కదలికలు, తాజా పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు రియల్ టైమ్‌లో సమాచారం అందించాలని ఆదేశించారు. మంగళవారం ఉదయం నుంచి ప్రతీ గంటకూ ఒక బులిటెన్ విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.