నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను తీవ్రరూపం దాల్చింది. ఇది శ్రీలంక తీర ప్రాంతం మీదుగా పయనిస్తూ మరింత బలపడింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలతో పాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ప్రస్తుతం ఈ తుపాను వాయువ్య దిశగా కదులుతూ, బంగాళాఖాతంలో కారైకాల్‌కు ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుందని అధికారులు ధృవీకరించారు.
ఈ తుపాను ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు అత్యంత సమీపంగా రానుందని ఐఎండీ అంచనా వేసింది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తమిళనాడు తీరంలో అక్కడక్కడా కుండపోతగా అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలి అని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదివారం దక్షిణ కోస్తాంధ్ర, తీవ్ర ప్రాంత రాయలసీమలోనూ అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖను స్పష్టం చేసింది.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కొన్నిసార్లు వీటి వేగం గంటకు 90 కిలోమీటర్లకు చేరుకోవచ్చని హెచ్చరించింది. సముద్రం అత్యంత అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఎగిసిపడతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో డిసెంబరు ఒకటో తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల్లో మత్స్యకారులు వేడకు వెళ్లడాన్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.