Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోడి పందాల్లో చేతులు మారిన రూ.కోట్లు

కోడి పందాల్లో చేతులు మారిన రూ.కోట్లు
, శుక్రవారం, 17 జనవరి 2020 (07:33 IST)
కోనసీమలో కోడిపందాల కారణంగా కోట్లు చేతులు మారాయని అంటున్నారు. సంప్రదాయం పేరిట యధేచ్చగా పందాలు నిర్వహించారు. బరుల చెంతనే మద్యం ఏరులై పారింది.

ప్రజాప్రతినిధుల అండతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు పెద్దఎత్తున చేపట్టారు. సంప్రదాయం ముసుగులో నిర్వహించిన పందేల్లో వేలాది కోళ్లు నేలకొరిగాయి. ఇదే సందర్భంలో పందెంరాయుళ్లు చెలరేగిపోయారు. జిల్లాలో ప్రధాన బరుల్లో నిర్వహించిన పందేల్లో రూ.కోట్లు చేతులుమారాయి.

కోడిపందేల బరుల్లో రూ.10 కోట్లు చేతులుమారి ఉంటుందని అంచనా. అలాగే గుండాట, పేకాట తదితర జూదాల ద్వారా మరో రూ.కోటి వరకు చేతులు మారి ఉంటుందని భావిస్తున్నారు.వీటి ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేసిన గుండాట, పేకాట యథేచ్ఛగా కొనసాగింది. అమలాపురం నియోజకవర్గంలో 10 పెద్దబరుల్లో కోడి పందేలు జోరుగా సాగాయి.

అల్లవరం మండలం గోడి వైనతేయ నది చెంత పందేలు నిర్వహించారు. ఇక్కడ ఆహ్లాదం కోసం బోటు షికారు, ఇతర ఏర్పాట్లు చేయడంతో పందేలను వీక్షించేందు కు మహిళలు, పిల్లలు సైతం తరలివచ్చారు. అల్లవరంలో పోలీస్‌స్టేషన్‌ సవిూపంలోనే కోడి పందేలు యథేచ్ఛగా జరిగాయి.

అమలాపురం పట్టణానికి ఆనుకునే గ్రావిూణ మండల పరిధిలోనూ విచ్చలవిడిగా బరులు వెలిశాయి. ఉప్పలగుప్తంలోనూ పందేలు జోరుగా జరిగాయి. రాజోలు నియోజకవర్గంలో రాజోలు, శివకోడు పెద్దబరుల్లో పెద్దఎత్తున కోడి పందేలు జరగ్గా, మరో 12 గ్రామాల్లో కొత్త బరులు వెలిశాయి.

మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో భారీ స్థాయిలో పందేలు నిర్వహించారు. పి.గన్నవరం నియోజకవర్గంలో అక్కడక్కడా పందేలు జరిగాయి. ఆత్రేయపురం మండలంలో లొల్ల, పేరవరం, ర్యాలీ, వసంతవాడ తదితర గ్రామాల్లో పెద్దబరుల్లో పందేలు నిర్వహించారు.

రాజానగరం నియోజకవర్గ పరిధిలోని కోరుకొండ కోటికేశవరంలో ఈసారి పెద్దబరి వెలిసింది. జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం, గండేపల్లి, కిర్లంపూడి పెద్దబరుల్లో పందేల జోరు కొనసాగింది. ప్రత్తిపాడు, రౌతులపూడి, శంఖవరంతో పాటు అనపర్తి నియోజకవర్గంలో బిక్కవోలు, అనపర్తి, రంగంపేట తదితర గ్రామాల్లోనూ పందేలు నిర్వహించారు.

రామచంద్రపురం, కాజులూరు, తుని నియోజకవర్గంలో రెండు చోట్ల, కాకినాడ గ్రావిూణ మండలం గొర్రెపూడి, తాళ్లరేవు మండల పరిధిలోని చినవలసల, పటవల ప్రాంతాల్లో పందేలు నిరాటంకంగా సాగాయి. కోడి పందేలు అనగానే అందరినోట కోజల అంటే పందెంలో ఓడిపోయిన కోళ్ల మాటే.. నిర్వాహకులు కోజల పంపిణీలో తలమునకలయ్యారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులకు వారి పరిధుల్లో కోజలు సిద్ధం చేయించి ప్రత్యేకంగా తరలించారు. పందేలకు తరలివచ్చిన సందర్శకుల నుంచి అంతే స్థాయిలో కోజలకు డిమాండ్‌ ఉండడంతో రూ.2,000 నుంచి రూ.10,000 వరకు పలికాయి.

గత ఏడాది ముందుగా అనుకున్న ప్రాంతాల్లోనే కోడి పందేలు నిర్వహించిన పందెంరాయుళ్లు ఈసారి రాత్రికి రాత్రే కొత్త బరులను ఏర్పాటు చేశారు.జిల్లాలో ప్రధానంగా ఐ.పోలవరం మండలం మురముళ్ల గ్రామంలో ఆదివారం భారీ స్థాయిలో కోడిపందేలు నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రధాన బరికి వేలాది మంది తరలివచ్చారు.

ఈ బరిలో కోడి పందేలను కొందరు ప్రజాప్రతినిధులు స్వయంగా పర్యవేక్షించడం గమనార్హం. ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల బుచ్చిబాబు పర్యవేక్షణలో ఇక్కడ కోడిపందేలు నిర్వహించారు. ఇంకా పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పందేలను వీక్షించారు. వందలాదిగా తరలివచ్చిన కార్లు, వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, జనంతో మురమళ్లలో తిరునాళ్ల వాతావరణం నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతిలో రైతుల్ని వేడుకుంటున్న పోలీసులు.. ఎందుకో తెలుసా?