Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో సేంద్రీయ సాగు విస్తరణకు కార్యాచరణ రూపొందించండి: ఆదిత్యనాథ్ దాస్

Advertiesment
ఏపీలో సేంద్రీయ సాగు విస్తరణకు కార్యాచరణ రూపొందించండి: ఆదిత్యనాథ్ దాస్
, శనివారం, 13 ఫిబ్రవరి 2021 (05:55 IST)
ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా విస్తరించేలా అవసరమైన కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులు విడుదలకు ఎటువంటి ఢోకా లేదని తెలిపారు.

సీఎస్ అధ్యక్షతన ప్రకృతి వ్యవసాయంపై సచివాలయంలోని ఆయన కార్యాలయంలో సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ముందుగా రాష్ట్రంలో సేంద్రీయ సాగుకు తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు కార్యాచరణపై ఏపీ రైతు సాధికార సమితి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు వివరించారు.

సేంద్రీయ వ్యవసాయంతో ఎంతో మేలు కలుగుతుందన్నారు. క్రిమి సంహారక మందులు వినియోగం తగ్గించడం వల్ల పెట్టుబడులు గణనీయంగా తగ్గుముఖం పడతాయన్నారు. భూసారం పెరగడంతో పాటు కరెంటు వినియోగం తగ్గుతుందన్నారు. నీరు కలుషితం కాకుండా నివారించొచ్చునన్నారు.

గ్లోబల్ వార్మింగ్ ను అడ్డుకోవొచ్చునన్నారు. ప్రకృతి సేద్యం వల్ల కలుషితంలేని పోషకాలతో కూడిన ఆహారాన్ని పొందే అవకాశం ఉందని వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రంలో సేంద్రీయ సాగు వ్యాప్తికి పెద్దపీట వేస్తున్నామన్నారు.

2020-21 వ్యవసాయ సీజన్ లో 3,730 పంచాయతీల్లో 3.40 లక్షల హెక్టార్లలో 7 లక్షల మంది రైతులు సేంద్రీయ వ్యవసాయాన్ని చేపట్టేలా లక్ష్యం నిర్ణయించుకున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాబోయే పదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ సేంద్రీయ సాగు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

ఖర్చులు ఆదా కావడంతో రైతుల ఆదాయం భారీగా మెరుగుపడుతుందన్నారు. రాష్ట్రంలో సేంద్రీయ సాగుకు విస్తరణకు పలు సంస్థలు తోడ్పాటునందిస్తున్నాయన్నారు. కొన్ని విద్యా, రీసెర్చ్ సెంటర్లు పలు అధ్యయనాలు కూడా అందజేశాయన్నారు.ముఖ్యంగా ప్రకృతి సేంద్రీయ సాగు వ్యాప్తికి డ్వాక్రా సంఘాలు కూడా ముందుకొస్తున్నాయన్నారు.

1,31,672 మంది డ్వాక్రా మహిళలకు విత్తనాల తయారీ వంటి అంశాలపై శిక్షణ అందించామన్నారు. సీఎం ఆదేశాల మేరకు సేంద్రీయ సాగుపై రాబోయే ఖరీఫ్, రబీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న 10,641 రైతు భరోసా కేంద్రాల ద్వారా క్యాంపెయిన్లు నిర్వహించే ఆలోచన ఉందన్నారు.

ఈ రెండు సీజన్ల ముందు వారం రోజుల పాటు ఈ క్యాంపెయిన్లు నిర్వహించనున్నామన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి సునీత మాట్లాడుతూ, సేంద్రీయ వ్యవసాయ సాగులో యువతను ప్రోత్సాహించడం ద్వారా మెరుగైన ఫలితాలు తీసుకురావొచ్చునన్నారు.

అనంతరం సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయ సాగు విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

అవసరమైన నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ను ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయం రాష్ట్రంలో మరింతగా విస్తరణకు అవసరమైన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు.

సేంద్రీయ సాగులో యువతకు భాగస్వామ్యం కల్పిస్తూ, వారికి ప్రత్యేక శిక్షణివ్వాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం: రిక్టర్ స్కేలుపై 6.1