'స్థానిక పోరు'కు పట్టుబట్టిన జగన్ సర్కారు.. పది పరీక్షలు వాయిదావేసింది!

మంగళవారం, 24 మార్చి 2020 (13:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం పెద్దగా లేదని, పైగా మరో నాలుగు వారాల వరకు అది పెద్ద ప్రభావం చూపకపోవచ్చని, అందువల్ల నిర్ణీత షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇపుడు ఈ నెల 31వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదావేసింది. ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్.. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వ్యాపించింది. ఇలాంటి నేపథ్యంలో పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే మేలని భావించి, పరీక్షలను వాయిదావేసింది. 
 
ఈ నెల 31వ తేదీ నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలను రెండు వారాలపాటు వాయిదా వేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఈ నెల 31 తర్వాత పరిస్థితులను సమీక్షించిన తర్వాత కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపారు.
 
కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి మంగళవారం ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏడుగురు కరోనా బారిన పడ్డారు.
 
మరోవైపు, ఏపీలో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. అయితే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోలేని కొందరు యథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను పట్టించుకోవడం లేదు.
 
ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని ప్రజలను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా సూచనలు చేశారు. లాక్ డౌన్ అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య అని... అలాంటి తీవ్ర నిర్ణయాన్ని ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. 
 
పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని కోరారు. దయచేసి ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావద్దని విన్నవించారు. అందరం కలిసి కరోనాను జయిద్దామని ఆయన ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మహారాష్ట్రలో కరోనా కల్లోలం.. 'సెంచరీ' దాటిన కేసులు