కోవిడ్ కష్టకాలంలో పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 'బ్లాక్ ఫంగస్' వ్యాధి చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకినవారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
పాజిటివ్ కేసుల గుర్తింపు కోసం రాష్ట్రమంతా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని.. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని.. వాటికి సంబంధించిన కేసులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని మంత్రి వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ వ్యాధికి సంబంధించిన మందులను సమకూర్చాలని సీఎం చెప్పారని మంత్రి తెలిపారు.
బ్లాక్ ఫంగస్ కరోనా రోగుల పాలిట పెనుముప్పుగా మారింది. బ్లాక్ ఫంగస్ కారణంగా కరోనా రోగులు కంటిచూపు పోగొట్టుకోవడమే కాకుండా, కొన్నిసార్లు మృత్యువాత కూడా పడుతున్నారు.
ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్‌పై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం స్పష్టం చేశారని వివరించారు.