సర్ పంపండి, స్వామివారిని దర్సించుకోవాలి, భక్తుల వేడుకోలు

శుక్రవారం, 20 మార్చి 2020 (20:09 IST)
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్సించుకోవడమంటే ఒక మహద్భాగ్యం. తిరుపతికి వచ్చే భక్తులందరూ అదే అనుకుంటూ ఉంటారు. స్వామివారిని ఎలాగైనా దర్సించుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. రద్దీ తక్కువగా ఉండాలని.. స్వామివారిని ఎక్కువసేపు దర్సించుకోవాలని భావిస్తుంటారు.
 
కాలి బాటన వెళ్ళే భక్తులైతే గోవింద నామస్మరణలతో తన్మయత్వంతో రెండు చేతులు జోడిస్తూ దణ్ణం పెడుతూ మెట్లపై ఎక్కుతూ తిరుమలకు చేరుతుంటారు. ఎన్నో వ్యయప్రయాసలతో తిరుమలకు వస్తుంటారు. స్వామివారికి మ్రొక్కు తీర్చుకుంటే మంచి జరుగుతుందన్నది భక్తులు ప్రగాఢ నమ్మకం. 
 
కోరిన కోర్కెలు తీరాలన్నా.. కష్టాల నుంచి బయటపడాలన్నా ఆ వైకుంఠ నాథుడే తమకు శ్రీరామరక్ష అని భక్తులు భావిస్తుంటారు. అలాంటి భక్తులకు స్వామివారి దర్సనం ఇప్పుడు లేదు. కరోనా ప్రభావంతో వారంరోజుల పాటు భక్తులను దర్సనానికి అనుమతించకుండా టిటిడి నిలిపివేసింది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులలో చాలామందికి సమాచారం తెలియకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
 
తిరుపతిలోని అలిపిరి వద్దకు వచ్చి మూసేసిన గేట్లను తదేకంగా చూస్తున్నారు. సర్.. తలుపులు ఎప్పుడు తెరుస్తారు.. మమ్మల్ని స్వామి దర్సనానికి పంపిస్తారా అంటూ టిటిడి సిబ్బందిని ప్రాథేయపడుతున్నారు. వారంరోజుల పాటు దర్సనం లేదని చెప్పినా వినిపించుకోవడం లేదు కొంతమంది భక్తులు. దీంతో టిటిడి సిబ్బంది వారికి నచ్చజెప్పి తిరిగి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కరోనా వైరస్ అప్‌డేట్: బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు కోవిడ్-19