అధికారంలోకి వచ్చి మా పొట్టలు కొడతారా? బొత్సను నిలదీసిన భవన నిర్మాణ కార్మికులు

శనివారం, 26 అక్టోబరు 2019 (12:31 IST)
ఏపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన శనివారం గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన్ను భవన నిర్మాణ కార్మికులు కడిగిపారేశారు. అధికారంలోకి వచ్చి మా పొట్టలు కొడుతారా అంటూ మండిపడ్డారు. 
 
వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత ఏర్పడింది. దీంతో భవన నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో భవన నిర్మాణ కార్మికులు ఆగ్రహోదగ్రులవుతున్నారు.
 
ఇలాంటి తరుణంలో గుంటూరుకు వచ్చిన మంత్రి బొత్సపై వారు తమ ప్రతాపం చూపించారు. మంత్రి బొత్స పర్యటనను అడ్డుకున్నారు. ప్రభుత్వ విధానం వల్ల పనుల్లేక అర్ధాకలితో బతుకుతున్నామని, మీకు ఓట్లేసి గెలిపించినందుకు మాకు చేసిన మేలు ఇదేనా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
దీంతో కార్మికులను సముదాయించి బొత్స ముందుకు సాగారు. అనంతరం నగరంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. డ్రైనేజీ నిర్మాణం నిలిచిపోయిన విషయాన్ని తెలుసుకున్నారు.
 
అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ప్రారంభమైన రోడ్లు, కాలువల నిర్మాణంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇలా తయారయ్యాయని, తమ ప్రభుత్వం వీటిని పూర్తి చేస్తుందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శివసేన డిమాండ్ న్యాయమైనది : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్