విశ్రాంతి లేదు.. సెలవు ఇవ్వండి సార్ అని అడిగాడు. కానీ పై అధికారి కుదరదు అన్నాడు.. అంతే మనస్తాపంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ సముద్రంలో దూకేశాడు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తున్నానని.. సెలవు కావాలని కోరినా.. ఉన్నతాధికారులు పట్టంచుకోలేదు. దీంతో ఉన్నతాధికారుల ప్రవర్తనపై మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా కొత్తవలస పోలీస్ స్టేషన్‌లో ఇ. శ్రీనివాసరావు అనే యువకుడు పోలీస్ కానిస్టేబుల్.. సెలవులు లేకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు కొన్నిరోజులు సెలవులు కావాలనీ, ఓసారి ఇంటికి వెళ్లివస్తానని శ్రీనివాసరావు స్టేషన్ సీఐని కోరారు. అయితే సెలవు కావాలనుకుంటే ఉద్యోగం మానేయాలని సీఐ రెడ్డి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాసరావు.. విశాఖ ఆర్కే బీచ్‌లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే అక్కడే ఉన్న ఈతగాళ్లు శ్రీనివాసరావును కాపాడి విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన విశాఖపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.