Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎల్జీ పాలిమర్స్‌ వద్ద మృతదేహాలతో ఆందోళన..తీవ్ర ఉద్రిక్తత

ఎల్జీ పాలిమర్స్‌ వద్ద మృతదేహాలతో ఆందోళన..తీవ్ర ఉద్రిక్తత
, శనివారం, 9 మే 2020 (20:07 IST)
విశాఖలో పెను విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గ్యాస్‌ లీకేజి ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలతో  పరిశ్రమ గేటు వద్ద ఆందోళన చేపట్టారు.

స్థానికుల ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ గ్యాస్‌ లీకైన ప్రదేశాన్ని పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్నారు. ఈక్రమంలో స్థానికులు ఒక్కసారిగా పరిశ్రమలోకి దూసుకెళ్లారు.

గేట్లు మూసివేసి పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆందోళనకారులు లెక్కచేయకుండా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో కొందరు మహిళలు డీజీపీ కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. 
 
బాధితుల‌కు ఎల్‌జీ పాలిమర్స్‌ క్షమాపణ...
మహా విషాదానికి కారణమైన గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై ఎల్‌జీ పాలిమర్స్‌ క్షమాపణ చెప్పింది. ఈ సంఘటనతో బాధపడుతున్న ప్రజలు, వారి కుటుంబాలకు అండగా నిలబడేందుకు అన్నివిధాల సహకరిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది.
 
విషవాయువు ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వంతో కలిసి తమ బృందాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయని పేర్కొంది. వెంటనే అమలు చేయగల సమర్థవంతమైన సంరక్షణ ప్యాకేజీని అందించడానికి కచ్చితమైన చర్యలను తక్షణమే అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. బాధితులు, మరణించిన వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు ఎల్‌జీ పాలిమర్స్‌ వెల్లడించింది.
 
స్థానికులకు దోహదపడేలా మధ్య, దీర్ఘకాలిక మద్దతు కార్యక్రమాలను కూడా చేపట్టనున్నట్టు తెలిపింది.  విశాఖలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి గురువారం తెల్లవారుజామున విషవాయువు లీకావడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురైన 300 మందిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
కాగా, గ్యాస్‌ లీకేజీ వల్ల జరిగిన నష్టానికి మధ్యంతర పరిహారంగా రూ. 50 కోట్లను విశాఖ కలెక్టర్‌ వద్ద డిపాజిట్‌ చేయాలని ఎల్‌జీ పాలీమర్స్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) నిన్న ఆదేశించింది. ప్రమాదానికి కారణమైన ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమను ఈరోజు మంత్రులు అవంతి శ్రీనివాస్‌, ధర్మాన ప్రసాదరావు, జయరాం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ 
పరిశీలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోమ్ గార్డులకు నిత్యవసర సరుకుల పంపిణీ