“వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం” యుద్ధ ప్రాతిపదికన దూసుకెళుతోంది. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానస పుత్రికగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 269 గ్రామాలలో సమగ్ర సర్వే పూర్తి అయ్యింది. 37 గ్రామ సచివాలయాల్లో ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రారంభం అయ్యాయి. త్వరలోనే మరో 14 గ్రామ సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సేవలు అందించనున్నాయి.
ఏరియల్ (డ్రోన్) సర్వే, కార్స్, జియన్ఎస్ఎస్ రోవర్ల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 2023 జూన్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వేను పూర్తి చేసి, వాస్తవ ఫలితాలు రైతులకు చేరేలా కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం 70 కార్స్ బేస్ స్టేషన్లను స్థాపించింది. మరోవైపు 1000 రోవర్లను కొనుగోలు చేసింది. మరో 1000 రోవర్లు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. ఈ పరిజ్ఞానముతో భూ సరిహద్దులను అక్షాంశ- రేఖాంశాలతో ఖచ్చితత్వoతో కొలిచి భూయజమానులకు అప్పగించటం జరుగుతుంది.
ప్రక్రియలో భాగంగా సర్వే పనులకు అత్యంత కీలకమైన ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజిల ఉత్పతి పెంచటం కోసం రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ ఏజెన్సీల సేవలను ఆహ్వానించగా మంచి స్పందన కనిపించింది. టెండర్ విధానంలో జిల్లాల వారీగా వర్క్ ఆర్డర్ ఇచ్చేలా టెండర్ ప్రక్రియను రూపొందించగా 11 ఏజెన్సీలు పాల్గొన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయవలసిన విస్తీర్ణం సుమారు 1.33 లక్షల చదరపు కిలోమీటర్లు ఉండగా సర్వే ఆఫ్ ఇండియాకు 40,690 చదరపు కిలోమీటర్లు, ఇతర ప్రవేటు డ్రోన్ ఏజెన్సీ లకు సుమారు 92,310 చదరపు కిలోమీటర్లు కేటాయించారు.
ఇప్పటివరకు సర్వే ఆఫ్ ఇండియా వారు 6377 చదరపు కిలోమీటర్ల మేర డ్రోన్ సర్వే పూర్తి చేసింది. ఈ బిడ్‌లో అతి తక్కువ ధర కోట్ చేసిన ఎస్ఏఏఆర్ ఐటి రిసోర్సెస్‌కు తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాలు డ్రోన్ సర్వే కోసం ఖరారు చేసారు. వీరు 12 నెలల కాల వ్యవధిలో 8597 చదరపు కిలోమీటర్లు పూర్తి చేయటం లక్ష్యంగా కలిగి ఉంది.
ఈ సంస్థకు చెందిన కన్సార్టియం భాగస్వామిగా ఉన్న క్రిష్టబెల్ ఇటీవల పాడేరు మండలం వాలు తిమ్మాపురం గ్రామములో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. మొదట తూర్పు గోదావరి జిల్లాలో రెండు డ్రోన్లతో కార్యక్రమం ప్రారంభించి మొత్తం 4 డివిజన్లు, విజయనగరం లోని మొత్తం 6 డివిజన్లలో సర్వే కార్యక్రమం కొనసాగేలా విస్తరించేలా ప్రణాళిక సిద్దం చేసారు. గత వందేళ్లలో ఏ ప్రభుత్వం చేయటానికి సాహసించని భూముల రీసర్వే చేపట్టటం వల్ల మరో శతాబ్ధం, గట్టిగా చెప్పాలంటే ఆపై మరో వందేళ్లు ఎవ్వరూ వేలెత్తి చూపించలేని విధంగా 2023 డిసెంబర్ నాటికి స్పష్టమైన రికార్డులు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలా నూతన మిశ్రమ సాంకేతిక పద్ధతిలో సర్వే చేస్తూ భారతదేశములో ఇతర రాష్ట్రలకు మార్గదర్శకoగా నిలుస్తుంది.