సాయంత్రం 6 నుండి ఉదయం 6 వరకు జనసంచారంపై పూర్తి నిషేధం: ఏపీలో ఫిర్యాదులకు 1902, 104 టోల్ ఫ్రీ నెంబర్

బుధవారం, 25 మార్చి 2020 (21:15 IST)
కరోనా లాక్ డౌన్ లో భాగంగా గురువారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకే నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాల విక్రయ కేంద్రాలు, రైతు బజార్లు తెరచి ఉంటాయని, మెడికల్ షాప్ లు రోజంతా అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు. 
 
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఈ మేరకు నిర్ణయించినట్టు వెల్లడించారు. అత్యవసర పరిస్తితితుల్లో మాత్రమే మధ్యాహ్నం 1.00 గంటల తర్వాత అనుమతిస్తారని చెప్పారు. సాయంత్రం 6.00 గంటల నుండి ఉదయం 6.00 గంటల వరకు జన సంచారం పూర్తిగా నిషేదిస్తున్నట్టు తెలిపారు. 
 
పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ తో కలసి చీఫ్ సెక్రటరీ గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్.పి.లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ  సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు నిత్యావసరాలు, కూరగాయలు, ఇతర అవసరాల కోసం పెద్ద ఎత్తున గుంపులుగా రాకుండా చర్యలు చేపట్టాల్సి వుందని కోరారు. 
 
ఇంటికి అవసరమైన సరుకులను తమ ఇంటికి రెండు కిలో మీటర్ల దూరంలోని ప్రాంతం నుండే తీసుకు వెళ్ళాల్సి ఉంటుందని, కుటుంబానికి అవసరమైన సరుకులన్నీ ఒకే వ్యక్తి తీసుకు వెళ్ళాల్సి ఉంటుందన్నారు. నిత్యావసర సరుకులు కొరత, లాక్ డౌన్ అమలు విషయంలో సమస్యలు వుంటే 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 
 
విదేశీయుల కదలికలకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు, కరోనా వైద్య చికిత్స లకు సంబంధించిన అంశాలపై 104 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయవచ్చని చీఫ్ సెక్రటరీ పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలతో పాటు సరకు రవాణా వాహనాలు వేటినీ నిలిపివేయవద్దని డి.జి.పి. గౌతమ్ సవాంగ్ కోరారు. 
 
విదేశాల నుండి వచ్చిన వారు ఎక్కడ వుంటున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారనే సమాచారం సేకరించడం ముఖ్యమని వారి కదలికలపై పోలీస్ లు, రెవిన్యూ, వైద్య శాఖలు కలసి పనిచేయాల్సి ఉందన్నారు. విదేశాల నుండి వచ్చిన వారి కదలికలు గుర్తించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని కుడా పరీక్షించాల్సి వుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యెక ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి సూచించారు. 
 
రేపిడ్ టెస్ట్ కిట్ ద్వారా 15 నిముషాల్లో పరీక్షించి వారిలో వ్యాధి లక్షణాలు ఉన్నదీ లేనిదీ గుర్తించ వచ్చన్నారు. విదేశాల నుండి వచ్చిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్ లో ఉంచాలన్నారు. కరోనాకు పాజిటివ్ గా నిర్ధారణ జరిగిన వారిలో 80 శాతం మందికి ఆసుపత్రిలో చికిత్స అవసరమే ఉండదని చెప్పారు. 
 
కేవలం 15 శాతం మందికే ఆసుపత్రిలో చికిత్స అవసరమన్నారు. వీరిని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కరోనా వార్డుల్లో చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. మరో 5 శాతం మందికి క్రిటికల్ కేర్ అవసరమని వీరికి చికిత్స అందించేందుకు విశాఖ లోని విమ్స్ తో పాటు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో చికిత్స అందించే ఏర్పాట్లు చేశామన్నారు.
 
రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు మాట్లాడుతూ కూరగాయలను గ్రామాల నుండి పట్టణాలకు తరలించేందుకు, నిత్యావసరాలను తరలించేందుకు ఆర్టీసీ బస్సుల సేవలను అందించేందుకు సిద్ధంగా వున్నట్టు చెప్పారు. కూరగాయల ధరల పట్టికను ప్రజలకు తెలియజేయడంతో పాటు వాటిని కూరగాయలు విక్రయించే ప్రదేశాల్లో ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
 
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎ. యండి. ఇంతియాజ్, నగర పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలరావు, జాయింట్ కలెక్టర్ కె. మాధవిలత,విజయవాడ సబ్ కలెక్టర్ హెచ్. యం.ద్యానచంద్ర, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ అనుపమ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం విజయవాడలో రైతు బజార్ల వికేంద్రీకరణ