శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణమండపంలోకి వేంచేపు చేశారు.
ఉదయం 7.00 నుండి 10.00 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. ఉదమం 10.00 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది.
ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 5.00 నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించేరు.
రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో యలప్ప, ధనంజయులు, సూపరిండెంట్ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అనిల్, ఆలయ అర్చక బృందం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.