ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సినిమా ముగింపు దశకు వచ్చిందని, వచ్చే వంద రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదులిపోతుందని ప్రముఖ సినీ హాస్య నటుడు పృథ్వీరాజ్ జోస్యం చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండల కేంద్రంలోని తేరు కూడలిలో ఆదివారం శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహావిష్కరణకు పృథ్వీరాజ్ హాజరయ్యారు.
ఇందులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. బలిజ, కాపులు ఐకమత్యంలో జగన్ పాలనకు మంగళం పాడాలని పిలుపు నిచ్చారు. జనసేన అధిష్టానం ఆదేశిస్తే సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబుపై పోటీకి తాను సిద్ధమని ప్రకటించారు.
మరో మంత్రి రోజాపై పృథ్వీరాజ్ తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. మంత్రి రోజా అసంబద్ధ వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు, మహిళా ఎమ్మెల్యేలే పట్టించుకోవడం లేదన్నారు. చిత్తూరు జిల్లాలోనే ఆమెకు మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేల మద్దతు కరువైందన్నారు. "వైనాట్ 175" అంటూ వైసీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారనీ, అంత ఆత్మవిశ్వాసముంటే 92 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నట్లు అని ప్రశ్నించారు. రానున్న వందరోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదులు తుందని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.
మీరు ఇంటికి చేరుకునేలోపు బదిలీలు ఉంటాయ్... : కలెక్టర్లకు సీఎం రేవంత్ వార్నింగ్
తెలంగాణ రాష్ట్రంలో పని చేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పలువురు అధికారుల పనితీరు ఏమాత్రం బాగోలేదని, ఇలాంటి వారు కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లేలోపు బదిలీలు ఉంటాయని హెచ్చరించారు.
ఆదివారం కలెక్టర్లతో ఆయన ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ మాట్లాడుతూ, "ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రభుత్వం 'ప్రజాపాలన' కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కొంతమంది పనితీరు బాగాలేదని, సమావేశం పూర్తయి ఇంటికెళ్లేలోపు పలువురి బదిలీలు జరుగుతాయని వారితో అన్నట్టు తెలిసింది.
అందుకు అనుగుణంగానే సమావేశం పూర్తయిన కొద్దిసేపటికే రాష్ట్రంలోని ఏడుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా, సమావేశ సమయంలో చర్చించాల్సిన అంశాలు కాకుండా ఇతరత్రా విషయాలు లేదా సీఎంను, ప్రభుత్వాన్ని ప్రశంసించే విషయాలను అధికారులు ప్రస్తావించినపుడు.. "స్టిక్ టు ద పాయింట్" అంటూ సమావేశ అజెండాకే పరిమితం కావాలని పలువురు అధికారులకు రేవంత్ సూచించారు.