Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుస్తెలు అమ్మినా పులస కూర తినలేమా? ఆ రోజులు త్వరలో రాబోతున్నాయట..

పుస్తెలు అమ్ముకోనైనా పులస తినాలనేది నానుడి. కానీ భవిష్యత్తులో పుస్తెలు అమ్మినా పులస కూర తినలేని పరిస్థితి ఎదురుకానుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచంలో అత్యంత రుచికరమైన పులస చేపకు అనువైంది ఒక్క గ

పుస్తెలు అమ్మినా పులస కూర తినలేమా? ఆ రోజులు త్వరలో రాబోతున్నాయట..
, సోమవారం, 24 అక్టోబరు 2016 (13:57 IST)
పుస్తెలు అమ్ముకోనైనా పులస తినాలనేది నానుడి. కానీ భవిష్యత్తులో పుస్తెలు అమ్మినా పులస కూర తినలేని పరిస్థితి ఎదురుకానుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచంలో అత్యంత రుచికరమైన పులస చేపకు అనువైంది ఒక్క గోదావరి నది మాత్రమే. ప్రస్తుతం అక్కడి ప్రతికూల వాతావరణంతో పులస జాడే కనిపించడం లేదని ఉభయ గోదావరి జిల్లాల మత్స్యకారులు చెప్తున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. మనం చేస్తున్న పనులే మనకు పులసలను దూరం చేస్తున్నాయని తేలింది. ఎలాగంటే.. హిల్స  అనే సముద్రపు చేప పునరుత్పత్తి కోసం.. ఏటికి ఎదురీది మరీ గోదావరిలోకి ప్రవేశిస్తుంది. అక్కడ పులసగా మారుతుంది. 
 
ఆపై గోదావరిలో గుడ్లు పెట్టి పిల్లలను సముద్రంలోకి హిల్సలుగా తిరిగి పంపుతుంది. అయితే గత కొన్నేళ్లుగా గోదావరి నదిలోకి వలస వచ్చే హిల్సల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఓఎన్జీసీ, ఇతర సంస్థలు చమురు తీసే సమయంలో వచ్చే ప్రకంపనలతో హిల్సలు భయపడి దారి మళ్లిపోతున్నాయి. దీంతో హిల్సల సంఖ్య తగ్గిపోతే పులసల సంగతి కూడా తగ్గుముఖం పడుతోంది.
 
హిల్సలు భయంతో గోదావరి వైపు కాకుండా చిలక సరస్సు, పశ్చిమ బెంగాల్‌లోని హుబ్లీ నది దిశగా పయనిస్తున్నాయని పరిశోధకులు నిర్ధారించారు. దీంతో పులస సంఖ్య తగ్గిపోతున్నాయని వారు చెప్తున్నారు. అయితే అక్కడ పునరుత్పత్తికి అనువైన పరిస్థితులు లేకపోవడంతో అవి తిరిగి గోదావరి వైపు వస్తున్నప్పటితీ.. నదీ ముఖ ద్వారంలో ఉన్న ఆయిల్ రిగ్‌ల ప్రకంపనల కారణంగా.. హిల్సలు గోదావరిలో ప్రవేశించే సాహసం చేయలేక సముద్రంలోకి తిరుగుముఖం పడుతున్నాయి. 
 
ఇకపోతే.. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో హిల్స చేప గోదావరిలోకి వస్తుంది. గోదావరిలో ఉండే బురదతో నిండిన చప్పనీరు పునరుత్పత్తికి అనుకూలం. అందుకే హిల్స చేప ఉప్పు నీటి నుంచి చప్ప నీటిలోకి చేరుతుంది. ఇలా చేరే సమయంలో ఈ చేప శరీరంలో అనేక మార్పులు జరిగి పులసగా మారుతుంది. గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న సమయంలో సువాసలను వెదజల్లే ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా ఈ చేప అత్యంత రుచికరంగా మారిపోతుంది. అందుకే ప్రజలు ఈ చేపను ఎక్కువగా ఇష్టపడతారు.
 
నదీ ముఖ ద్వారాలైన యానాం లాంటి సాగర సంగమ ప్రాంతాల్లో చమురు బావులు, పరిశ్రమలు పులసకు పెనుముప్పుగా మారాయి. చమురు వెలికితీత.. వాటి వలసకు ఆటంకంగా మారాయి. దీంతో రానున్న రోజుల్లో పులస చేప కనిపించకుండా పోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏడాది గ‌డిచింది... అమ‌రావ‌తిలో ఏం మిగిలింది? అదే నీరు, మ‌ట్టి...