Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైకాపా ఎంపీ మృతి పట్ల సీఎం జగన్ - చంద్రబాబు దిగ్భ్రాంతి

వైకాపా ఎంపీ మృతి పట్ల సీఎం జగన్ - చంద్రబాబు దిగ్భ్రాంతి
, గురువారం, 17 సెప్టెంబరు 2020 (08:15 IST)
కరోనా వైరస్ బారినపడి తిరుపతి పార్లమెంట్ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ (64) హఠాన్మరణం చెందడం పట్ల సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొన్నివారాల కిందట కరోనా పాజిటివ్ అని తేలడంతో బల్లి దుర్గాప్రసాద్‌ను కుటుంబ సభ్యులు చెన్నై తరలించారు. చికిత్స పొందుతుండగా ఆయనకు ఈ సాయంత్రం తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వైద్యులు ఎంతో శ్రమించినా ఆయన్ను బతికించలేకపోయారు.
 
ఇక దుర్గాప్రసాద్ మృతిపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఆయన దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. దుర్గాప్రసాద్ కుమారుడితో మాట్లాడిన ఆయన తన సంతాపం తెలియజేశారు. ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. 
 
అనంతరం ట్విట్టర్‌లో తన స్పందన తెలియజేశారు. నాలుగు దశాబ్దాల ప్రజాజీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ప్రజాసేవలో అవిరళ కృషి చేశారని కొనియాడారు. బల్లి దుర్గాప్రసాద్ మరణం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. 
 
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చెన్నైలో కరోనా చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో తన స్పందన తెలియజేశారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఇక లేరన్న వార్త తెలిసి ఎంతో బాధ కలిగిందని వివరించారు. 
 
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, మిత్రులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. బల్లి దుర్గాప్రసాద్ గతంలో నాలుగు సార్లు టీడీపీ తరఫున గూడూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో ఓసారి మంత్రిగానూ వ్యవహరించారు. 
 
ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతిపై ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుకుంటున్నానని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. కరోనా మహమ్మారితో పోరాటంలో ఆయన మృత్యువుకు బలయ్యారని తెలిపారు. ప్రాణాంతక వైరస్ ఆయనను కబళించడం తీవ్ర విచారం కలిగిస్తోందని ట్వీట్ చేశారు.
 
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు హఠాన్మరణం బాధాకరమని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. తామిద్దరం సుదీర్ఘకాలం టీడీపీలో కలిసి పనిచేశామని గుర్తుచేసుకున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ఆయనకు అవకాశం లభించిందని, ఒక మంచి మిత్రుడ్ని కోల్పోయానని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్