ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు. అభివృద్ది విషయంలో చంద్రబాబు నాయుడు ఒక అన్‌స్టాపబుల్ అంటూ పేర్కొన్నారు. ఈ ఒక్క విషయంలో ఆయనను ఎవరూ ఆపలేరని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ఇపుడు దేశ పారిశ్రామికవర్గాలు, సోషల్ మీడియాలో వైరల్ అయింది. దశాబ్దాలుగా చంద్రబాబు అనుసరిస్తున్న అభివృద్ధి విధానాలకు తాను ఆకర్షితుడినవుతున్నానని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
"ఈ మనిషి ఒక తిరుగులేని శక్తి. ఎప్పటికప్పుడు కొత్త విధానాలను తీసుకురావడమేకాకుండా, తనతో పాటు తన చుట్టూ ఉన్నవారి ప్రమాణాలను కూడా ఆయన పెంచుతూ ఉంటారు" అని ప్రశంసించారు. ఇటీవల విశాఖలో జరిగిన 30వ భాగస్వామ్య సదస్సులో.. పెట్టుబడులకు సులభతర వాతావరణం కల్పించేందుకు 'ఎస్క్రో' విధానం తెస్తామని చంద్రబాబు మాట్లాడిన వీడియోను ఆయన తన ట్వీట్‌కు జత చేశారు.
ఆనంద్ మహీంద్రా ప్రశంసలపై సీఎం చంద్రబాబు కూడా ఎక్స్ వేదికగానే స్పందించారు. "భారత్ అద్భుతమైన వృద్ధి దశలోకి ప్రవేశిస్తున్న ఈ తరుణంలో, విధానకర్తగా దేశంలోని పారిశ్రామిక శక్తిని వెలికితీయడమే నా బాధ్యత" అని వినమ్రంగా తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు కొత్త మార్గాలను అన్వేషించడం, వాటిని సులభతరం చేయడమే తన కర్తవ్యమని పేర్కొన్నారు.
దేశ ప్రగతిలో మహీంద్రా గ్రూప్ భాగస్వామ్యం అమూల్యమైనదని, ఆంధ్రప్రదేశ్‌కు మిమ్మల్ని స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నానని చంద్రబాబు బదులిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో అత్యంత చురుగ్గా ఉండే ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన సమాధానం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.