ఒకపుడు జీవినభృతి కోసం కట్టెలు కొట్టి విక్రయించిన మహిళే ఇపుడు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైంది. ఆమె ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ముగిసి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడమేగాక ఇప్పుడు ఏకంగా చిత్తూరు మేయర్‌గా ఎన్నికైంది.
దీనిపై ఆమె స్పందిస్తూ, మాది పేద కుటుంబం. అమ్మానాన్న చనిపోయేనాటికి నాకు ఊహ కూడా తెలియదు. అక్క నాగభూషణం కుటుంబ బాధ్యత తీసుకుంది. అక్కతోపాటు పనికిపోయేదాన్ని. ఆమె పడుతున్న కష్టం చూసి.. మేముంటున్న చోటి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడివికిపోయి కట్టెలు కొట్టేదాన్ని. వాటిని మోసుకొచ్చి మా కాలనీలో అమ్మితే రూ.20 వచ్చేవి.
మేం ముగ్గురు అక్కాచెల్లెళ్లం, ఓ తమ్ముడు. ఇంత కష్టపడితే ఇప్పుడిçప్పుడే జీవితంలో స్థిరపడ్డాం. నేనెవరో కూడా జనానికి తెలియదు. అయితే జగనన్నను చూసి ఓట్లేసి నన్ను గెలిపించారు. ఇప్పుడు మేయర్‌ను చేశారు. ఇది నా జీవితంలో అస్సలు ఊహించలేదు. ప్రజలకు నమ్మకంగా ఉండి.. పార్టీకి మంచిపేరు తీసుకొస్తాను. చిత్తూరును అభివృద్ధిలో ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా చేస్తా అని తెలిపారు.