Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజీనామాలు ఉత్తుత్తి బెదిరింపులేనా? చింతమనేని ఎందుకు సైలెంట్ అయినట్లు?

మంత్రివర్గ విస్తరణలో తమకు పదవులు రాలేదన్న కోపం, తమకు రాకపోగా తమ ప్రత్యర్థులకు, నిన్న కాక మొన్న వచ్చిన ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు అప్పనంగా ఇచ్చేశారన్న మంట. చివరిదాగా ఊరించి, నమ్మించి చివరికి లిస్టులోనే లేకుండా చేశారన్న బాధ.. మంత్రిపదవులు రాని టీడీప

రాజీనామాలు ఉత్తుత్తి బెదిరింపులేనా? చింతమనేని ఎందుకు సైలెంట్ అయినట్లు?
హైదరాబాద్ , మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (02:30 IST)
మంత్రివర్గ విస్తరణలో తమకు పదవులు రాలేదన్న కోపం, తమకు రాకపోగా తమ ప్రత్యర్థులకు, నిన్న కాక మొన్న వచ్చిన ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు అప్పనంగా ఇచ్చేశారన్న మంట. చివరిదాగా ఊరించి, నమ్మించి చివరికి లిస్టులోనే లేకుండా చేశారన్న బాధ.. మంత్రిపదవులు రాని టీడీపీ నేతలను, ఎమ్మల్యేలను ఉడికించాయి. ఇంకేం.. పొలోమంటూ రాజీనామాలు.. బెదిరింపులు, అటు దూకేస్తామంటూ ప్రకటనలు, రాజకీయాలే వద్దంటూ హుంకరింపులు.
 
అన్నీ 24 గంటల్లోనే చల్లబడిపోయాయా..చంద్రబాబుపై ఇంతెత్తున ఎగిరిన నేతలు బెదిరింపులతో ఆగిపోయి  రూటు మార్చేస్తున్నారా.. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పదవిపై కొండంత ఆశలు పెట్టుకున్న చింతమనేని ప్రభాకర్ తనకు మంత్రి పదవి రాదని తెలీగానే మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవి ఉంటే ఎంత లేకుంటే ఎంత అనే రేంజిలో ఎగిరి దుమికారు. రాజీనామా అస్త్రం కూడా ప్రయోగించారు. చివరికి బాబు నుంచి పిలుపు రాగానే కలిసి మాట్లాడి తుస్సుమన్నారు.
 
అసమ్మతి లేదు.. గిసమ్మతి లేదు.. పార్టీకి, చంద్రబాబుకు విధేయుడిగా ఉండి పనిచేస్తానని పత్రికలకు ప్రకటన కూడ విడుదల చేశారు. అంత ఎగురుడు ఎందుకు, ఇంత తగ్గుడెందుకు అంటే ఎవరూ పైకి జవాబు చెప్పరు. చంద్రబాబుల ఎన్నడూ లేనట్లుగా పెరుగుతున్న మొహమాటాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నడూ లేని విధంగా ఆయనపై తిరుగుబాటు ప్రకటించిన ఎమ్మెల్యేలను చూసి మీడియానే మొదట బిత్తర పోయింది.
 
ఇక తెలుగుదేశం పని అయిపోయిందని, వైకాపాలో చేరడానికి అసమ్మతి ఎమ్మెల్యేలు, పదవి కోల్పోయిన మంత్రులు మానసికంగా సిద్ధమైపోయారని మీడియా, సోషల్ మీడియా వార్తలతో కుమ్మేసింది. ఏదో జరుగుతోందనిపించింది కానీ చింతమనేని అంతటివాడే బాబును కలిసి వచ్చాక జావకారి పోయినట్లు తగ్గిపోవడం వెనుక బాబు చాణక్యం బాగానే పనిచేసినట్టు తెలుస్తోంది.
 
మంచిగా మాట్లాడితే  వింటే సరి. లేకుంటే నీ చిట్కా, మీ హిస్టరీ అంతా నా డాష్ బోర్డులో ఉంది జాగ్రత్త అని చంద్రబాబు బెదిరిస్తే తెలుగుదేశంలో తట్టుకుని నిలబడగలిగిన మొనగాడు ఉన్నాడా అని సందేహం. బాబుతో పెట్టుకుంటే అంతేమరి. బాబు మంత్రం ఫలించి సోమవారం సాయంత్రానికి  చింతమనేని జావకారిపోయారు. ఆయన భాషలో చెప్పాలంటే మనసు మార్చుకున్నారు. 
 
రేపు మిగతా ఎమ్మెల్యేలూ, సీనియర్లూ కూడా మనసు మార్చుకోవలిసిందే. బెల్లాన్ని దగ్గర పెట్టుకుని చీమలు ఎప్పుడైనా దూరం జరుగుతాయా అనేది ప్రశ్న కాదు. సమాధానమూ దాంట్లోనే ఉంది మరి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రిపదవిని ఆశిస్తే రిటైర్మెంట్ చేయిస్తారా బాబుగారూ... గోలగోల పెడుతున్న గౌతు